నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ జీరో జెడ్ 0456 నంబరు గల బస్సు విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో వినుకొండ మీదుగా నరసరావుపేటకు చేరింది. అందులో బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామానికి చెందిన బోయిన ఆదాము (55) ప్రయాణిస్తూ మృతి చెందాడు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల గమనించి విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికు తెలియజేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చిలకలూరిపేటలో అనారోగ్యంతో ఉన్న తన భార్య మరియమ్మను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఆరోగ్య పరిస్థితిపై బంధువులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు.


