బెదిరించి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బెదిరించి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితుల అరెస్టు

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

బెదిరించి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితుల అరెస్టు వాహన చోదకుడి నిర్లక్ష్యానికి వృద్ధురాలి బలి సింగరుట్ల ఆలయ నిర్మాణానికి రూ.2 కోట్లు విడుదల ఆవుకు కవల దూడలు జననం

మంగళగిరి రూరల్‌: మంగళగిరి మండలం యరబ్రాలెం గ్రామంలో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని అనంతరం బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.90 వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసినట్లు రూరల్‌ సీఐ చిరుమామిళ్ల వెంకట్‌ తెలిపారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన ఉదయ్‌ బెహరా యరబ్రాలెం పారిశ్రామికవాడ లో అల్యుమినియం కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను సోషల్‌ మీడియాలో పోలో గే అనే డేటింగ్‌ యాప్‌ ద్వారా విజయవాడ కు చెందిన మహంకాళి కిషోర్‌, పచ్చిగోళ్ళ మోషే, పల్లేటి క్రాంతికుమార్‌లతో పరిచయం పెంచుకున్నారు. ఈ ముగ్గురు జూలై 26 అర్ధరాత్రి యరబ్రాలెంలోని ఉదయ్‌ బెహరా గదికి వెళ్లి బెదిరింపులకు పాల్పడి ఫోన్‌న్‌ పే ద్వారా రూ.90 వేలు, మరో బాధితుడి నుంచి రూ.800 బదిలీ చేయించుకున్నారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలతో నిందితులను గుర్తించి జూలై 28న అరెస్ట్‌ చేశారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ వాహన చోదకుడి నిర్లక్ష్యానికి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దాసరి సత్యనాగ కుమారి (63) గృహిణి. వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం విజయవాడ నగరానికి చేరుకుంది. బందరురోడ్డు పీవీపీ మాల్‌ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వైపు వేగంగా వెళుతున్న మట్టా భాను ప్రకాష్‌ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన సత్యనాగ కుమారి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది.

స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తాడేపల్లి మున్సిపల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనాగకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

కారెంపూడి: చారిత్రక ప్రసిద్ధి చెందిన మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సింగరుట్ల క్షేత్రంలో కొలువై ఉన్న స్వయంభు శ్రీనారసింహాస్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.2 కోట్లు సీజీఎఫ్‌ నిధులు విడుదలైనట్లు దేవదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారని దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త గుండాల శ్రీనివాసరావు బుధవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. మ్యాచింగ్‌ గ్రాంటు కింద రూ. 20 లక్షలు జమ చేయాల్సి ఉందన్నారు. మ్యాచింగ్‌ గ్రాంటు మొత్తం జమ కాగానే సీజీఎఫ్‌ నిధులు దేవాలయ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. నెల రోజుల గడువు లోగా మ్యాచింగ్‌ గ్రాంటు జమ చేయాల్సి ఉందన్నారు.

రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామంలో బుధవారం ఓ ఆవుకి రెండు దూడలకు (కవలలు) జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని సింగు వెంకయ్యకు చెందిన ఆవు రెండు కోడె దూడలకు జన్మనిచ్చింది. రెండుసంవత్సరాలకిందట ఈ ఆవుకు ఒక కోడెదూడ జన్మించగా ప్రస్తుతం కవలలకు జన్మనిచ్చినట్లు వెంకయ్య తెలిపారు. ఆవుకు రెండు దూడలు జన్మించిన విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. ఆవు గర్భంలో పిండం అడ్డం తిరగడంతో వైద్యసేవలు అందించినట్లు పశువైద్యులు నాగార్జున తెలిపారు. పశువులలో కవలలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement