ఈసీఐ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు.
ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాజేష్ కుమార్ సింగ్, రోహిత్ కుమార్, స్వతంత్ర కుమార్ మీనా, మల్లికార్జున్ రెడ్డిలతో కలసి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఈఆర్‌ఓల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఓటర్ల జాబితాల తయారీలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకునే వారి అర్హతను సంబంధిత ధ్రువపత్రాల ఆధారంగా పరిశీలించాలని చెప్పారు. ఎలాంటి సందేహాలకు తావులేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ముసాయిదా జాబితా ప్రచురణ, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి ప్రతి దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ సాయికుమార్, ఈఆర్‌ఓ లు, జిల్లా ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
గుంటూరు వెస్ట్: రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను, అధికారులకు కేటాయించాల్సిన బాధ్యతలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు రాష్ట్రస్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్‌ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


