న్యాయం చేయాలంటున్న హక్కుదారు
తాడికొండ: కోర్టులో ఉన్న వక్ఫ్ భూములకు అధికార పార్టీ నేతల జోక్యంతో వేలం నిర్వహించిన ఘటన తాడికొండ గ్రామ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. తరతరాల నుంచి ముతవల్లీ కుటుంబ సభ్యులు ఆధీనంలో ఉన్న భూమిపై కన్నుపడిన అధికార పార్టీ నాయకులు పక్కాగా ప్లాన్ అమలు చేశారు. భర్త మరణించడంతో ముతవల్లీ కుటుంబ సభ్యురాలైన షాకీరా బేగం ఈ భూమిలో ఉంది. ఈ కుటుంబానికి 1910 నుంచే భూమిని సాగుచేసుకొని జీవించేలా డాక్యుమెంట్ ఉంది. అయితే గతేడాది ఈమె కౌలు చెల్లించుకునేందుకు వక్ఫ్ అధికారులు వ్యతిరేకించారు. దీంతో షాకీరా బేగం హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా వక్ఫ్ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించగా వారు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదని ఆమె తెలిపారు. ఆ భూమిని అక్రమంగా వేలం వేస్తున్నట్లు తమకు తెలిసి అడిగినందుకు తమపై అక్రమంగా కేసు బనాయించారని వాపోయింది. అధికారులను గట్టిగా నిలదీస్తే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి తమకు ఒత్తిడి ఉందని చెబుతున్నారని బాధితురాలు వాపోయింది. బుధవారం వక్ఫ్‌బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో భూములకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో సర్వే నెంబర్ 1476 లో 65 సెంట్లు, సర్వే నెంబర్ 1486లో 10.63 సెంట్లు మొత్తం భూమికి ఎకరాకు రూ.13 వేల చొప్పున షేక్ ఇలియాస్, షేక్ జిలానీలు వేలంలో దక్కించుకున్నారు.


