చిరంజీవిగా నిలిచిన చంద్ర తిరుపంరెడ్డి
గుంటూరు మెడికల్: అవయవదానంతో నలుగురి జీవితాల్లో వెలుగు నింపిన ప్రముఖ వ్యాపారవేత్త 57 సంవత్సరాల చంద్ర తిరుపంరెడ్డి. మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం వలన పలువురు రోగులకు కొత్త జీవితం లభించినట్లయింది. ఈనెల 23న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన చంద్ర తిరుపం రెడ్డిని విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు తరలించారు. నిపుణులైన వైద్యులు చికిత్స అందించారు. అన్ని ప్రయత్నాలు విఫలమై, ఈనెల 28న వైద్యులు ఆయనను బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆ సమయంలో జీవన్ దాన్ కోఆర్డినేటర్లు అవయవ దానం ప్రాముఖ్యతను తిరుపంరెడ్డి కుటుంబ సభ్యులకు వివరించారు. తీవ్ర విషాదంలోనూ తిరుపంరెడ్డి భార్య జయలక్ష్మి, కుమారుడు అఖిల్ రెడ్డి, కుమార్తె చంద్ర సౌజన్య మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ అవయవ దానానికి అంగీకరించారు. ఆయన దానం చేసిన రెండు కంటి కార్నియాలు ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు, ఒక మూత్రపిండం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరుకు, మరో మూత్రపిండం సన్‌రైజ్ హాస్పిటల్స్ విజయవాడకు, కాలేయం కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరుకు కేటాయించి పంపించారు. అవయవాల మార్పిడి ద్వారా పలువురు రోగులకు కొత్త జీవితం లభించనుంది. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.రమేష్ బాబు మాట్లాడుతూ, ‘అవయవ దానం అనేది ఒక వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవం పోసే అత్యున్నత మానవతా సేవ’ అని పేర్కొన్నారు.


