ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు
నరసరావుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, నోడల్ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియను నియమించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణంలో ఫెస్ట్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యాటకుల సంఖ్యకు తగినవిధంగా ఫుడ్‌కోర్టులు, స్టాల్స్, తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫిరంగిపురం, నాదెండ్ల, వంకాయలపాడుల నుంచి కొండవీడు కోటకు వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గత ఉత్సవాలలో పర్యాటకులను ఆకర్షించిన హెలిరైడ్, బోటింగ్ వంటి వాటికి అదనంగా కార్యక్రమాలు రూపొందించాలని ఈవెంట్ మేనేజర్‌ను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి కృష్ణ్ణప్రియ, డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీవో మధులత, దీపీఓ నాగేశ్వర్‌నాయక్ పాల్గొన్నారు.
సత్తెనపల్లి: ధనుర్మాసంను పురస్కరించుకొని సత్తెనపల్లిలోని అలివేలు మంగ పద్మావతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారిని ‘జగత్ రక్షకుడు’గా అలంకరించి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారికి విశేష పౌర్ణమి పూజ, గరుడ పూజ చేసి శ్రీవారిని ‘ఉత్తర దిశగా’ ఊరేగించారు. గరుడ ప్రసాదంను ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు భక్తులకు అందించారు. ఆలయ ప్రాంగణంలో కోలాటం ఆడారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నకరికల్లు: శివముక్కోటిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్శింగపాడు లోని శ్రీ మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తు లకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమే త అమరేశ్వరునికి శనివారం ఆరుద్రోత్సవం నిర్వహించా రు. శనివారం వేకువజామున మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలు త పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం దాతల సహకారంతో సుమారు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా వండి స్వామివారికి అభిషేకించారు. తొలుత అర్చకు లు, వేద పండితులు వెంకటాద్రినాయుని మండపంలో మహాన్యాసం నిర్వహించి అనంతరం 11 అమృతాలతో ఏకదశ రుద్రాభిషేకం వండిన నాలుగు క్వింటాళ్ల అన్నంతో అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని అన్నప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి ఏడాదీ అన్నప్రసాద వితరణ సాయంత్రం మూడు గంటల వరకు జరిగేది ఈ ఏడాది రెండు గంటలలోపు అన్న ప్రసాద వితరణ ముగించటంతో పలువురు భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు


