బాలికను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన యువకులు
బాలిక కుటుంబ సభ్యులపై దాడి చేసి మరీ తీసుకెళ్లిన యువకుడు
మంగళగిరి టౌన్: పట్టపగలే ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటన శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. మంగళగిరి పట్టణ పరిధిలోని గండాలయపేటకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఒక కుమార్తె విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.
ఈనెల 2వ తేదీ అనుమతి లేకుండా మీ కుమార్తె బయటకు వెళ్లిందని కాలేజీ యాజమాన్యం బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. విచారించగా కురగల్లుకు చెందిన రవితేజ అనే అబ్బాయితో వెళ్లినట్లు తేలింది. అదేరోజు రాత్రి బాలిక తల్లిదండ్రులు కురగల్లులోని రవితేజ ఇంటి నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రవితేజ కొంతమంది యువకులతో బాలిక ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్లాడు. అడ్డుకునేందుకు యత్నించిన తమపై దాడి చేశారని విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది.
నిందితులపై కేసులు
విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వీరాస్వామి పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. విద్యార్థినిని తీసుకువెళ్లిన రవితేజను వెలగపూడి సచివాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్న కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రవితేజతో పాటు వెళ్లిన యువకులు విజయవాడకు చెందిన వారని, అందులో కొంతమందిని గుర్తించామని, మరో వ్యక్తి కురగల్లుకు చెందిన వ్యక్తి అని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రవితేజపై పోక్సో యాక్ట్‌తో పాటు కిడ్నాప్, మహిళలపై దాడి కేసు నమోదు చేశామని, అతనికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. అయితే తల్లిదండ్రులతో వెళ్లేందుకు విద్యార్థిని నిరాకరించడంతో మేయర్స్ హోంకు తరలించారు.


