ముక్కోటి ఏకాదశికి కిక్కిరిసిన వైకుంఠపురం
అర కిలోమీటరు వరకు బారులు తీరిన భక్తులు ఉత్తరద్వారంలో కనులారా శ్రీవారి దర్శనం
తెనాలి: చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలిలోని వైకుంఠపురంలోగల శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలోని క్యూ లైన్లు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి తెల్లవారుజాము 4.30 గంటల్నంచి ఉత్తరద్వారంలో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయంలో ఉచిత దర్శనంతోపాటు డోనర్లకు, రూ.150, రూ.300 క్యూ లైన్లు అన్నింటిలోనూ భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనానికి గంటల సమయం పట్టినప్పటికీ ఓపికగా వేచి ఉండి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం, అంతరాలయ దర్శనాలు చేసుకున్నారు. అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ, అలహరి రవికుమార్‌లు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం స్వామివారు అమ్మవార్లతో సహా పురవీధుల్లో ఊరేగుతూ ప్రజలకు దర్శనమిచ్చారు.దేవస్థానం సహాయ కమిషనర్/ కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముక్కోటి ఏకాదశికి కిక్కిరిసిన వైకుంఠపురం


