హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన పొన్నూరు రూరల్ సీఐ
చేబ్రోలు: చేబ్రోలు మండలం నారాకోడూరులో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్య కేసులోని నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తేదీన నారాకోడూరు గ్రామ శివారులో నత్తల మృత్యంజయరావును అదే ప్రాంతానికి చెందిన ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్య చేశారు. సంచలనం కలిగించిన ఈకేసును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఛేదించి, నిందితులను అరెస్ట్ చేశారు. ఈమేరకు పొన్నూరు రూరల్ సీఐ పి.కృష్ణయ్య వివరాలను వెల్లడించారు. నారాకోడూరు గ్రామానికి చెందిన పెరికల శ్రీకర్ ఆధిపత్య విభేదాల కారణంగా ఎంపీటీసీ నత్తల రమేష్‌కు తమ్ముడైన మృతుడు నత్తల మృత్యంజయరావును హత్య చేయటానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. గ్రామస్థాయి రాజకీయ ఆధిపత్య పోటీ, ఫ్లెక్సీల ఏర్పాటు, గత ఘర్షణలు, అవమానాల కారణంగా ప్రతీకార భావనతో పెరికల శ్రీకర్, పెరికల రమణయ్య, పెరికల వరుణ్, తూమాటి సుమన్, మేడికొండ వెంకటేష్‌లతో కలిసి కుట్రపన్ని, డబ్బు ప్రలోభాలతో బండ్లమూడి రాజు, ఇంటూరి అభినాష్‌లను లోబర్చుకుని ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. 27వ తేదీన గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న మృత్యంజయరావును నారాకోడూరులోని కామధేను దానా గోడౌన్ సమీపంలో కారుతో ఢీ కొట్టి అనంతరం కత్తులతో దాడిచేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పున్నట్లు వివరించారు. మంగళవారం చేబ్రోలు సినిమాహాలు సమీపంలో పెరికల శ్రీకర్, బండ్లమూడి రాజు, ఇంటూరి అభినాష్, పెరికల రమణయ్య, పెరికల వరుణ్, ఒక మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల్లో కొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చేబ్రోలు, పొన్నూరు ఎస్‌ఐలు పి.వీరనారాయణ, వి.ఈశ్వర్, శ్రీహరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


