‘ఘన’ంగా వ్యర్థాల నిర్వహణ
సబ్ కలెక్టర్ సంజనా సింహ అభినందన
తెనాలి: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహ అన్నారు. మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడుతో కలిసి సబ్‌కలెక్టర్ మంగళవారం పూలే కాలనీలోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, బుర్రిపాలెంరోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డును సందర్శించారు. ఆయాచోట్ల జరుగుతున్న ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను స్వయంగా పరిశీలించారు. వివరాలను తెలుసుకున్నారు. పట్టణ అవసరాల ప్రకారం 20 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రం ఆవశ్యకత ఉన్నప్పటికీ, పూలే కాలనీలో 10 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రం నడుస్తుండటం మంచి విషయమన్నారు. మురుగునీటిని శుద్ధి చేయటం, శుద్ధి చేసిన నీటిని పొలాలకు తరలించటం వల్ల నాణ్యమైన పంటను తీసుకోవచ్చని తెలిపారు. అలాగే మున్సిపల్ డంపింగ్ యార్డులో చెత్తను 60 శాతం తొలగించారని తెలిపారు. చెత్తను మట్టిగా మార్చి పల్లపు ప్రదేశాల్లో మెరకకు ఉపయోగిస్తున్నారని, కొంత చెత్తను జిందాల్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. కొబ్బరిబోండాలను రోడ్డు పక్కన పడేయకుండా పీచు తీసే యూనిట్‌కు తరలించాలని ఆమె సూచించారు. మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు మాట్లాడుతూ ఇంట్లో వచ్చే చెత్తను అక్కడే విభజించుకుని తడిచెత్తను ఇంట్లో లేదా టెర్రస్‌లో మొక్కలకు వాడుకుంటూ పొడిచెత్తను మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.


