గృహ లక్ష్యాలు పూర్తిచేయాల్సిందే!
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: గృహ నిర్మాణ లక్ష్యాలను మార్చి నాటికి పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్–3 గృహాల్లో స్టేజ్ డివియేషన్ ఉన్నవాటిని గుర్తించి వాటిని సరిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పునాదులు నింపేందుకు జిందాల్ సంస్థ యాష్ ఉపయోగించుకోవాలన్నారు. లే అవుట్‌లలో మౌలిక వసతుల కల్పనకు అవసరాలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇసుకకు ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.
‘ఉల్లాస్ అక్షర ఆంధ్ర’ సక్రమంగా నిర్వహించాలి..
జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాల మేరకు సక్రమంగా నిర్వహించాని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. మంగవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఉల్లాస్ అక్షర ఆంధ్ర పై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓస్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర ద్వారా అక్టోబరు నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారన్నారు. వంద గంటలు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందన్నారు.


