సమ సమాజ నిర్మాణంలో ఎన్‌ఎస్‌ఎస్ కీలకపాత్ర
ఏఎన్‌యూలో ఉత్తమ పురస్కారాలు ప్రదానం
ఏఎన్‌యూ(పెదకాకాని): సమ సమాజ నిర్మాణంలో ఎన్‌ఎస్‌ఎస్ కీలకపాత్ర వహిస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ వలెంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.దివ్యతేజోమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ ఆచార్య కె.గంగాధరరావు మట్లాడుతూ జాతీయ సేవా పథకం సేవల ప్రాధాన్యతను, విలువల గురించి, సామాజిక బాధ్యతల గురించి తెలియజేశారు. భావి తరాలకు విలువలు, ఉన్నతమైన మార్గం నిర్దేశాలు అందించడంలో జాతీయ సేవా పథకం ముందుంటుందన్నారు. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్ పాల్గొని యువత సేవాభావంతో, క్రమశిక్షణతో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ప్రత్యేక శిబిరాల ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ స్థాయి జాతీయ సేవా పథకం ఉత్తమ కార్యక్రమ నిర్వహణ అధికారులుగా డాక్టర్ డి.ధాత్రికుమారి (ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు), డాక్టర్ జె.సుబ్బారావు (చేబ్రోలు హనుమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్స్), డాక్టర్ ఎం.దాసు (శ్రీ ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రేపల్లె), సీహెచ్ అంకమ్మనాయుడు ( విజ్ఞాన్ డిగ్రీ కళాశాల), ఎస్.శంకరయ్య (విజె డిగ్రీ కళాశాల, మంగళగిరి), డాక్టర్ పి.శ్రీనివాసులు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేబ్రోలు) ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్ వలెంటీర్లుగా సీహెచ్ ఐశ్వర్య, బి.సంజన, సీహెచ్ కార్తికేయ శ్రీరామ్, జి.తిరుపతి కళ్యాణ్, ఎస్‌కె షరీన్, ఎస్‌కె మస్తాన్ వలిలకు వారి సేవలను అభినందిస్తూ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆర్.శివరామ్‌ప్రసాద్, రిజిస్టార్ ఆచార్య జి.సింహాచలం, ఓఎస్‌డీ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వీరయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్, వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీపీ సత్యపాల్ కుమార్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్ లింగరాజు, ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.తేజోమూర్తి, గుంటూరు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జె.వి.సుధీర్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


