ఇతరులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు
సీఐడీ ప్రాంతీయ కార్యాలయ ఇన్‌ఛార్జ్ అధికారి బి.సునీల్
నగరంపాలెం: ఇతరులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సీఐడీ ప్రాంతీయ కార్యాలయ ఇన్‌ఛార్జ్ అధికారి బి.సునీల్ అన్నారు. సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు మెడికల్ కళాశాల ఆవరణలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ అధికారి బి.సునీల్ మాట్లాడుతూ తెలియని మొబైల్‌ఫోన్ల నుంచి వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని సాధ్యమైనంత వరకు షేర్ చేయవద్దని చెప్పారు. అపరిచితులతో సెల్పీలు తీసుకోవద్దన్నారు. బాగా తెలిసిన స్నేహితులైనా.. గుడ్డిగా నమ్మవద్దని తెలిపారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్ సమాచారం చెప్పి, సైబర్ నేరాలకు గురికావద్దన్నారు. ఒకవేళ సైబర్ నేరాల బారినపడితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో యువత మొబైల్‌ఫోన్లకు బానిసగా మారుతున్నారని అన్నారు. తద్వారా సోషల్ మీడియాలో సమయం వృథా చేసుకుంటున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్టు, ఆన్‌లైన్, క్రెడిట్ కార్డ్, షాపింగ్, సోషల్ మీడియా, ఫింగర్ ప్రింట్ నేరాలపై సైబర్ క్రైమ్ మహిళా ఎస్‌ఐ రాజా వర్ష అవగాహన కల్పించారు. సైబర్ నేరం జరిగిన గంటలో 1930కు ఎలా ఫిర్యాదు చేయాలనేది వివరించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలని ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ డీవీడీ ప్రసాదరావు అన్నారు. ఓటీపీ, ఫిషింగ్ కాల్స్, నకిలీ లింక్‌లు, ఏటీఎం/డిజిటల్ మోసాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ అశవర్త్ నారాయణ తెలియజేశారు. సదస్సులో గుంటూరు సీఐడీ ప్రత్యేక కోర్టు సీనియర్ ఏపీపీ సుకుమార్, ఇన్స్‌పెక్టర్ నిమ్మకూరి వెంకటేశ్వరరావు, కళాశాల ఉప ప్రిన్సిపల్ శ్రీధర్, ఆచార్యులు నాగేశ్వరరావు, బ్యాంక్ అధికారులు, సీఐడీ ప్రధాన కార్యాలయ సైబర్ క్రైం/ గుంటూరు ప్రాంతీయ కార్యాలయపు అధికార, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


