అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్‌జీఎఫ్‌ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్‌షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
●84 మందికి రూ.3.84 కోట్లు ఇవ్వాలని ఆరోపణ
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
యడ్లపాడు: ఓ స్వర్ణకారుడు నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆభరణాలు చేసిస్తానని చెప్పి సుమారు 84 మంది బాధితుల నుంచి రూ.3.84 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని వసూలు చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడులో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...యడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ సమీపంలో నివసించే ఏలూరి కామేశ్వరరావు అనే వ్యక్తి స్వర్ణకారుడు. గతంలో అతని తండ్రికి మంచి పేరు ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు కొత్త ఆభరణాల తయారీ కోసం పెద్ద మొత్తంలో బంగారం, అడ్వాన్స్ నగదు అందజేశారు. కొంతకాలంగా నగలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కామేశ్వరరావు, ఏడాదిగా బాధితులకు కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. బాధితులు ఫోన్ చేస్తే మాత్రం ‘త్వరలోనే ఇచ్చేస్తాను‘ అని నమ్మబలుకుతూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. చివరకు మోసపోయామని గ్రహించి బుధవారం ఫిర్యాదు చేసేందుకు సుమారు 84 మంది బాధితులు వచ్చారని తెలిపారు. సుమారు రూ.3.84 కోట్లు నష్టపోయినట్లుగా బాధితులు పేర్కొంటున్నారని వెల్లడించారు. లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని కోరామన్నారు. కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ టి. శివరామకృష్ణ తెలిపారు.
అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు


