వైభవంగా బాల ఏసు తిరునాళ్ల
ఆర్సీఎం గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిన భాగ్యయ్య హాజరు అధిక సంఖ్యలో తరలి వచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తిన చర్చి ప్రాంగణం
● ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం ● విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్
అచ్చంపేట: క్రిస్మస్ వేడుకలలో భాగంగా మండలంలోని తాళ్లచెరువులోని బాల ఏసు దేవాలయంలో తిరువాళ్ల మహోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు మందిరానికి తరలి వచ్చి, కొవ్వొత్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీప కాంతులతో చర్చి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. గుంటూరు రోమన్ క్యాథలిక్ మిషన్ పీఠాధిపతి చిన్నాబత్తిన భాగ్యయ్య దివ్యపూజా బలి నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని బోధించారు. క్రిస్మస్ అనగా దేవుడైన క్రీస్తు మానవరూపుడై భువికి అరుదెంచిన వేళ అన్నారు. అందిరిపై క్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థించారు. లోకరక్షకుడైన ఏసు క్రీస్తు పాపులను రక్షించుటకు భూమిపై అవతరించారని చెప్పారు. ఎదుటి వారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని బోధించారు. పొరుగు వారిని ప్రేమించాలని, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని ప్రబోధించారు. విచారణ గురువులు తుమ్మా మర్రెడ్డి, రెవ. ఫాదర్ తుమ్మా కరుణాకరరెడ్డి, రెవ. ఫాదర్ పవన్, రెవ. ఫాదర్ రేపూడి రాయప్ప, రెవ ఫాదర్ థామస్ బైబిల్ పఠనం చేశారు. 64 మంది కన్య సీ్త్రలు ప్రార్థనలో పాల్గొన్నారు. క్రైస్తవ గీతాలు ఆలపించారు. ప్రత్యేక బృందాలచే కోలాటం ప్రదర్శన చేశారు. గ్రామ సృష్టికర్త అరళానందస్వామి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దేవాలయ సమీపంలో అన్నదానం నిర్వహించారు. బాలఏసు స్వరూపంతో అలంకరించిన తేరు ప్రదక్షిణ మహోత్సవం కనుల పండువలా జరిగింది. తాళ్లచెరువు గ్రామవీధులలో మేళతాళాలు, బాణసంచాలతో తేరు ఉరేగింపు ఆకట్టుకుంది. పలు గ్రామాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. క్రీస్తుకు కొవ్వొత్తులు సమర్పించుకున్నారు. రైతులు తమ వ్యవసాయ సామగ్రిని చర్చి చుట్టూ తిప్పి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా చర్చి ముందు స్టాల్స్, రంగుల రాట్నాలు, చెరుకు గడల విక్రయాలు ఏర్పాటయ్యాయి. మండలంలోని పలు గ్రామాలలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట, మాదిపాడు, తాడువాయి, చెరుకుంపాలెం, కోనూరు, గ్రంథసిరి, వేల్పూరు, చింతపల్లి, చిగురుపాడు తదితర గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
సాగరమాత ఆలయంలో ఘనంగా క్రిస్మస్
విజయపురి సౌత్: స్థానిక ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాక నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జోసఫ్ బాలసాగర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని, ఆయన సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు అనిల్, కిరణ్, సిస్టర్స్, భక్తులు పాల్గొన్నారు.


