పని దొరకడం లేదని..
కత్తితో మెడ కోసుకున్న వ్యక్తి నెల్లూరు నగరంలో ఘటన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్‌వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురై గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్‌వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.


