పీఎంవీబీఆర్‌వై ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల
గుంటూరు వెస్ట్: జిల్లాలోని వ్యాపార, పారిశ్రామిక రంగానికి చెందిన ఉద్యోగులు, యజమానులకు ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్ ఘర్ యోజన పథకం (పీ.ఎం.వీ.బీ.ఆర్.వై) ప్రయోజనాలు అందించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో బుధవారం పీఎంవీబీఆర్‌వై పథకంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ, ఈఎస్‌ఐ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవ, తయారీ రంగ పరిశ్రమలలో ఉద్యోగాల సృష్టిని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎంవీబీఆర్‌వై పథకం ద్వారా కార్మికులకు, యజమానులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నారని తెలిపారు . అనంతరం కలెక్టర్, అధికారులు సంబంధిత బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రి, అసిస్టెంట్ కమిషనర్ కె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్‌సింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నాగేశ్వరరావు, ఈఎస్‌ఐ అధికారి కె. చెన్నకేశవులు, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించాలి
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, విద్యా ప్రమణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా బుధవారం తెలిపారు. పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం ద్వారా పది పరీక్షలలో నూరు శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా ‘మన బడి – మన బాధ్యత‘ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.. జిల్లాలోని 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సెలింగ్ అందిస్తారని తెలిపారు.


