వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను నెరవేర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను సైతం నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్‌మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోఉన్న తరుణంలో నకిలీ వస్తువుల జాడ్యం మార్కెట్లను పట్టి పీడిస్తోందని అన్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. మరో అతిథి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి కె.విజయలక్ష్మి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలని, వీలైనంత వరకు ఐఎస్‌ఐ, హాల్‌మార్క్ చిహ్నాలు కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాసరచనలో తెలుగు, ఇంగ్లిషు మీడియం వారీగా గుంటూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థిని భవిత, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కృష్ణతులసి, ఎలక్యూషన్‌లో మంగళగిరి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని కనకపుట్లమ్మ, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని సాక్షి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కోమల పద్మ, ఎంఈవోలు అబ్దుల్ ఖుద్దూస్, హవీలా, నాగేంద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ


