ఆకాశమే హద్దుగా విజయాలు ఉండాలి
సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత
ఏఎన్‌యూ(పెదకాకాని): మారుతున్న కాలంలో సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎక్కువ కష్టపడే వారికి విజయావకాశాలు ఆకాశమే హద్దుగా మారిపోతాయని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిపార్ట్‌మెంట్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రథమ సంవత్సర న్యాయ విద్యార్థుల స్వాగతోత్సవ కార్యక్రమానికి ఆమె గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువ న్యాయ విద్యార్థులు కోర్సు పూర్తి అయ్యాక ఏమి చేయాలో ఆలోచించడం కన్నా కోర్సు ఆరంభంలోనే వారు ఏమి కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ ప్రకారంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ లా బోర్డ్ స్టడీస్ చైర్ పర్సన్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డిపార్ట్‌మెంట్ లీగల్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ విభాగం న్యాయ విద్యార్థులకు అన్ని విధాలుగా తోడ్పడుతూ వారి జీవన, విద్యా ప్రమాణాలను పెంపునకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం ఆఫీసర్ మండూరి వెంకటరమణ పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. న్యాయ విభాగం అధ్యాపకులు డాక్టర్ పి.వెంకటరమణ, డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ రామకోటిరెడ్డి, డాక్టర్ రామకృష్ణ బాబా, పరుచూరు కుమారి, దినకర్, మనోజ్, సైకాలజీ అధ్యాపకురాలు ప్రమీలారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.


