తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటంలో కీలకపాత్ర
తెనాలి: సంఘ గుర్తింపు రద్దయినప్పటికీ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నామనీ, రాబోయే ఉద్యమాల్లో సంఘం కీలక పాత్ర పోషిస్తుందని తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్‌గుప్తా స్పష్టం చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ)గ్రూప్–సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్‌లో ఘనంగా ప్రారంభించారు. గ్రూప్–సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు, కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డీఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటి తరం కార్మికుల పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు రద్దు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గ్రూప్ ‘సి’ సంఘం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉద్ధతమైన పోరాటాలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌ఎఫ్‌పీఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్.పరాశర్ మాట్లాడుతూ అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్ ‘సి’ సంఘ గుర్తింపును కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులున్నా అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పి–4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె. మురళి, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, పీ3, పీ4, జీడీఎస్ సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు, పెన్షనర్ల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్‌గుప్తా


