మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెం
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ మోడల్ హైస్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్‌లో ఆదివారం ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూశాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచడంతో పాటు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉపాధ్యాయుల మ్యాచింగ్ గ్రాంట్ సమస్యను పరిష్కరించడంతో పాటు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ ఉద్యోగోన్నతులను చేపట్టాలన్నారు. ఫిట్మెంట్ అమలుతోపాటు, పే ప్రొటెక్షన్, సర్వీస్ రూల్స్, సెలవు రోజుల్లో స్టడీ అవర్స్ తగ్గింపు, తెలుగు, హిందీ భాషా పండితుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ముందు ఉంటుందని అన్నారు, ఏపీ మోడల్ స్కూల్స్ రాష్ట్రోపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెన్త్ స్టడీ అవర్స్ విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, స్లిప్ టెస్టులను నిర్వహించి, తక్షణ మూల్యాంకనం, మార్కులు ఆన్‌లైనంలో అప్‌లోడ్‌కు తగిన పమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెబ్ ఎక్స్ సమావేశాలను తగ్గించాలని కోరారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూ అధ్యక్షుడు పి.సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శౌరిరాజు, రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షుడు ఎం.ప్రభుదాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లెపు శ్రీనివాసరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ మేరీ వేలాంగిణి, సీహెచ్ ఝాన్సీవాణి, పద్మజ, విజయలక్ష్మి, పద్మావతి, మేరీ సూజన్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.


