
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి మార్గాలు పెరగాలన్నా, ఆర్థిక ప్రగతి కావాలన్నా వ్యవసాయంతోపాటు పరిశ్రమల స్థాపన కూడా ఎంతో ముఖ్యమన్నారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం వచ్చే దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో పరిష్కరించాలన్నారు. లోటుపాట్లు ఉంటే అధికారులు గైడ్ చేయాలని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు దేవదాయ శాఖతో సమన్వయం చేసుకుని సంబంధిత భూములను ఏపీఐఐసీకి అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
రుణాలు మంజూరు కీలకం
జిల్లాలో ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వ్యాపార విస్తరణకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా అందించాలని సూచించారు. వాణిజ్య, వ్యాపారవేత్తల నైపుణ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మండల, నియోజకర్గ స్థాయిలో నిర్వహించే ఆర్‌ఏఎంపీ వర్క్‌షాప్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. జిల్లాలో పీఎం విశ్వకర్మ పథకం ద్వారా శిక్షణ పొందిన చేతివృత్తిదారులకు టూల్ కిట్స్ అందజేయడంతోపాటు అవసరమైన వారికి వ్యాపార సంస్థల ఏర్పాటుకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ప్రోత్సాహకాల కింద 24 క్లెయిమ్స్‌కుగాను రూ. 1.37 కోట్లు మంజూరు చేస్తూ కలెక్టర్ ఆమోదం తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.జయలక్ష్మి, డీడీ మధుసూదనరావు, కమర్షియల్ టాక్స్ డీసీ మనోరమ, డీఆర్డీఏ పి.డి. టీవీ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, జిల్లా నైపుణ్య అధికారి సంజీవరావు, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
యువత వృత్తి నైపుణ్యాలను
పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్: యువత వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే ఉపాధి మార్గాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఇండియా స్కిల్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీలోపు పోటీకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం తదితర మొత్తం 63 నైపుణ్య ట్రేడ్‌లపై పోటీ నిర్వహిస్తారన్నారు. జనవరి 1, 2001 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.జయలక్ష్మి, డీడీ మధుసూదనరావు, కమర్షియల్ టాక్స్ డీసీ మనోరమ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు.