
డిగ్రీ ప్రవేశాలు ప్రారంభర
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం దీనికి కల్పించింది. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా సమూల మార్పులతో డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాలను హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే పరిశీలన చేస్తారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కళాశాలలో చేరికలు వరుస క్రమంలో జరగన్నాయి.
24 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, బాపట్లలోని మహిళా కళాశాలలు, చేబ్రోలు, రేపల్లె, వినుకొండ, మాచర్లలోని కో–ఎడ్యుకేషన్ కళాశాలలతో పాటు 70 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు డిగ్రీ కళాశాలల నుంచి ఆన్‌లైన్‌లో సెట్స్.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ.400, బీసీ రూ.300, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.200 చొప్పున చెల్లించాలి. అన్ని ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన విద్యార్థులు వాటి పరిశీలనకు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆప్షన్లు మార్చుకునేందుకు 29న తుది అవకాశం ఉంటుంది. 31న సీట్ల కేటాయించాక సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు 26 వరకు గడువు