
జెడ్పీ చైర్‌పర్సన్ ఎక్కడ?
గత నెలలోనే విదేశీ పర్యటనకు హెనీ క్రిస్టినా
5 నుంచి వెళ్లినట్లుగా అధికారికంగా సమాచారం
వైస్ చైర్మన్‌కు బాధ్యతల అప్పగింతలో కనీస నిబంధనలు పాటించని వైనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌లో నెలకొన్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన చైర్‌పర్సన్ నాలుగు వారాలుగా వ్యక్తిగత పనులపై విదేశాల్లో ఉన్నారు. 15 రోజులకు పైబడి అందుబాటులో లేకుంటే, వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు.
పాలనపై అంతులేని నిర్లక్ష్యం
గత నెల 26వ తేదీ నుంచి చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. దీనిపై అధికారికంగా సమాచారం పంపలేదు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళుతున్నట్లు అధికారికంగా సమాచారం పంపారు. వాస్తవానికి 15 రోజులకుపైగా అందుబాటులో లేకుంటే, వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాలుగు వారాలుగా అందుబాటులో లేకుండా దేశం దాటి వెళ్లినప్పటికీ, ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోయారు. జెడ్పీలో పరిపాలనకు ఆటంకం కలుగకుండా చూడాల్సిన ప్రభుత్వం, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీలో జరుగుతున్న వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాగం సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాలనలో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అదే విధంగా తెనాలి జిల్లా కోర్టులో విచారణలో ఉన్న ఓ కేసులో వాయిదాలకు గైర్హాజరవుతున్న కత్తెర హెనీ క్రిస్టినా.. తాము విదేశాల్లో ఉన్నామంటూ కోర్టుకు సమాధానం పంపుతున్నారని తెలిసింది.