
దివ్యాంగులకు ‘సదా’రం కష్టాలు
ప్రణాళిక లేకుండా పంపుతున్న సచివాలయ ఉద్యోగులు జాబితాలో పేర్లు లేకపోవటంతో వెనక్కి వెళ్లాలంటున్న వైద్యులు కూటమి ప్రభుత్వ తీరుపై ఆందోళనకు దిగిన బాధితులు
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు దివ్యాంగుల పాలిట శాపంగా మారుతున్నాయి. రీ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారిని గుర్తించి తెనాలి జిల్లా వైద్యశాలకు సచివాలయ ఉద్యోగులు పంపుతున్నారు. అయితే గురువారం లిస్ట్‌లో ఉన్న వారిని కాకుండా అదనంగా 40 మంది దివ్యాంగులను వారు ఇక్కడకు పంపారు. దీంతో గందరగోళం నెలకొంది. సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం వారికి పరీక్షలు చేలేదు. దీంతో సూపరింటెండెంట్ ముందు బాధితులు నిరసన తెలిపారు.
చుక్కలు చూపెడుతున్న సర్కార్ తీరు
దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారుల్లో చాలామందికి పింఛన్‌లు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం రీ వెరిఫికేషన్ చేయించేందుకు తెనాలి జిల్లా వైద్యశాలకు తెనాలి, వేమూరు, మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులను పంపారు. ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, సైక్రియాటిక్ విభాగాలకు చెందిన వైద్యులు వీరికి పరీక్షలు చేసి సదరం సర్టిఫికెట్‌లు ఇచ్చారు. ఆ సమయంలో క్యాంప్‌నకు హాజరు కాని వారు బాపట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కువ మంది ఉన్నారు. వారిని గురువారం తెనాలి పంపారు.
అసలు లెక్కే లేదు..
వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో గురువారం తెనాలి జిల్లా వైద్యశాల ఆవరణలోని డైక్ సెంటర్‌కు వచ్చారు. చీరాల నుంచి వచ్చిన ఈఎన్‌టీ వైద్యురాలు, నర్సారావుపేట నుంచి వచ్చిన సైక్రియాటిక్ వైద్యులు పరీక్షలు చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అధికారులు ఇచ్చిన జాబితాతో ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేశారు. మిగిలిన వారు ఉదయం నుంచి సాయంత్రం అయిన వేచి చూసినా పరీక్షలు చేయకపోటంతో ఆందోళనకు దిగారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణిని కలసి తమ ఆవేదన తెలియజేశారు. కేవలం 25 నుంచి 30 మంది వరకే రోజుకు పరీక్షలు చేసే అవకాశం ఉందని, ఎక్కువ మందిని పంపటం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆమె గుర్తించారు. వెంటనే బాపట్ల డీఆర్‌డీఏ పీడీతో మాట్లాడి ఇలా ఎక్కువ మందిని పంపొద్దని కోరారు. గురువారం అదనంగా వచ్చిన 40 మందిని రోజుకు 10 మందికి పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు దివ్యాంగులకు తెలియజేయడంతో వారు శాంతించారు.