
భౌతికంగా దూరమై.. ఔదార్యంతో సజీవమై..
గుంటూరు మెడికల్: బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం గ్రామానికి చెందిన ముద్దన వెంకటరావు (62) ఈ నెల 9వ తేదీన పర్చూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌కు తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులకు తెలిపింది. వారు రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అవయవ దానం ప్రాముఖ్యతను వివరించారు. వెంకటరావు అవయవాలు మరో ఐదుగురి ప్రాణాలను కాపాడగలవని తెలిపారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి అవయవాలు సేకరించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి వాటిని అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. కాలేయం, ఒక మూత్రపిండాన్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. మరో కిడ్నీని విజయవాడ విజయా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న రోగికి అమర్చారు. ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు కళ్లను తరలించారు. అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అభినందించారు. అవయవాల సేకరణ, గ్రీన్ చానెల్ ద్వారా వాటిని సంబంధిత ఆసుపత్రులకు చేరవేయడాన్ని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.మమత రాయపాటి, బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కార్తీక్ చౌదరి మాట్లాడుతూ, ఆగస్టు నెలలో బ్రెయిన్‌డెడ్ అయిన ముగ్గురి నుంచి అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు విజయవంతంగా మార్పిడి చేసి ప్రాణాలు కాపాడామన్నారు.
రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవయవ దానానికి అంగీకరించిన కుటుంబసభ్యులు అవసరమైన ఐదుగురికి అమర్చడంతో వారికి పునర్జన్మ