
‘ప్లాస్టిక్’ అనర్థాలపై చైతన్యం పెరగాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై అందరూ చైతన్యం పెంచుకోవాలని, పర్యావరణ ఏపీ అందరి లక్ష్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రాజెక్టులో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ క్‌లైమెట్ యాక్షన్ ప్లాన్–అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్’ను మంగళవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... విద్యా, రాజకీయ, సామాజిక, సాహిత్య రంగాల్లో చైతన్యవంతమైన గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలకడం గొప్ప విషయమన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన గొప్ప నాయకులను అందించిన, ఆచార్య నాగార్జునుని బోధనలతో చైతన్యవంతమైన నేల ఇదని అన్నారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమాజాన్ని చైతన్యపరచాలన్నారు. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. అందరూ ఇళ్లలో ప్లాస్టిక్ వినియోగం నిలిపివేస్తేనే భావి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించగలమన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రపంచ తలసరి ప్లాస్టిక్ వినియోగం సగటున 28 కిలోలు ఉండగా, దేశంలో 11 కిలోలుగా ఉందని చెప్పారు. దేశంలో ఏటా 3.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై 2021లో చేసిన చట్టం ద్వారా గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడం వలన వాటిలోని హానికారకమైన రంగులు, రసాయనాలతో భూమితోపాటు నీటి నాణ్యత క్షీణిస్తోందని తెలిపారు. విద్యార్థులతో ప్రారంభించిన ఈ ప్రచారం ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతోపాటు ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సేవకులు, పౌర సమాజం ఉమ్మడి లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భాగస్వాములైన అందరి కృషిని అభినందించారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు శ్రీకారం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు
అవగాహన కల్పించనున్న విద్యార్థులు
మొదటి దశలో రాష్ట్రంలోని 52 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి 5 వేల మంది విద్యార్థులు 50 వేల గృహాలను దత్తత తీసుకుంటారని తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం పది గృహాలను సందర్శించి వాయు, నీటి కాలుష్యం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా చూడటం, ఘన వ్యర్థాలను వేరు చేయడంతోపాటు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తారని అన్నారు. రాష్ట్రంలోని 172 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి లక్ష మంది యూత్ రెడ్‌క్రాస్ వలంటీర్ల భాగస్వామ్యంతో 10 లక్షల గృహాలను దత్తత తీసుకోవడం లక్ష్యమన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు.
కార్యాచరణ ప్రణాళికతో ప్రాజెక్టు
రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీదా, కోశాధికారి పి. రామచంద్రరాజు ఈ ప్రాజెక్టు రూపకల్పన, కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనికి విశేష కృషి చేసిన పి.రామచంద్రరాజును గవర్నర్ అభినందించారు. గుంటూరులోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో రూపొందించిన వీడియో గీతం ఆహూతులను ఆకట్టుకుంది. విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గవర్నర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్‌లాల్, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, ఎమ్మెల్యేలు ఎండీ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బి.రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ వడ్లమాని రవి, వలంటీర్లు, విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.