
‘క్విట్ ఇండియా’ అమరవీరులకు ఘన నివాళి
తెనాలి: క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలిలో 1942 ఆగస్టు 12న జరిగిన నిరసనలో పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన ఏడుగురు అమరవీరులకు మంగళవారం ఘన నివాళి అర్పించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన వీర సంస్మరణ దినోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహ, మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు రణరంగచౌక్‌లోని అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులకు జోహార్లు అర్పించారు. ముందుగా అన్నాబత్తుని పురవేదిక నుంచి ర్యాలీగా బయలుదేరి రణరంగ్ చౌక్‌కు చేరుకున్నారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, పోలీసులు కవాతుగా తరలి వచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తదుపరి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విశేష సేవలందించిన ప్రముఖులకు, స్వాతంత్య్రోద్యమంలో అసువులుబాసిన వారి కుటుంబ సభ్యులకు సత్కరించారు. సత్కారం అందుకున్నవారిలో సమరయోధుడు షేక్ అబ్దుల్ వహాబ్ కోడలు షేక్ నూర్జహాన్, మరో సమర యోధుడి కుమారుడు షేక్ కరిముల్లా, డీ3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి.శారద, మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ, హెల్పింగ్ సోల్జర్స్ ఇనయతుల్లా, ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, మాజీ సైనికోద్యోగి అనంతగిరి ఏడుకొండలరావులు ఉన్నారు. నృత్యగురువులు ఎ.వెంకటలక్ష్మి, ఆరాధ్యుల తేజస్విప్రఖ్యల శిష్యబృందం వివిధ నృత్యాంశాలను, ‘మా తెలుగు తల్లి’ నృత్యరూపకాన్ని ప్రదర్శించింది.
స్తూపాల వద్ద నివాళులర్పించిన మంత్రి మనోహర్ బహిరంగ సభలో పలు రంగాల ప్రముఖులకు సత్కారం