
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.

వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్‌ఆర్‌ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం
అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది.
