
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.
గులాం మొహిద్దీన్ స్ట్రీట్‌లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.