
సాక్షి, తాడేపల్లి: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం.. ఒక్కో ఓటర్‌కు ఒక్కో రౌడీని దింపారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందులలో మోహరించారని అన్నారు.
పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ పార్టీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఒక్కో ఓటర్ కోసం బయటి నుంచి ఒక్కో రౌడీ వచ్చారు. ప్రతీ పోలింగ్ బూత్‌కు 400 మందిని మోహరించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేశారు. స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా?. ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారు.
వాళ్లంతా ఎవరు?..
మంత్రి సవిత ఆధ్వర్యంలో బయటి నుంచి వ్యక్తులు పులివెందులకు వచ్చారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి నల్లపురెడ్డి.. వారిని తీసుకొచ్చారు. ఈ కొత్తపల్లిలో పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మకాం వేశారు. బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటర్ కాదు.. కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలీసుల సమక్షంలోనే బయటివాళ్లు వచ్చి పాగా వేశారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది.. బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులు.. దాదాపుగా మొత్తం 7 వేలమంది పులివెందులలో మోహరించారు.
ఎర్రబల్లిలో ఓటర్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. కనంపల్లి సర్పంచ్‌ను పోలీసులు గన్‌తో బెదిరించారు. కనంపల్లిలో బీటెక్ రవి తమ్ముడు దౌర్జన్యం చేశాడు. కనంపల్లిలో ఓటు కోసం ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిని ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లే చెప్పారు. రీపోలింగ్‌లోనూ యథేచ్చగా దొంగ ఓట్లు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు. టీడీపీ వాళ్లు వందలాది మంది ఉన్నా పట్టించుకోలేదు.
వైఎస్సార్‌సీపీ వాళ్లే లక్ష్యంగా..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్‌సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేశారు. అభ్యర్థి హేమంత్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. పులివెందుల టౌన్‌లో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. రిగ్గింగ్ చేయడానికి వెళ్లిన టీడీపీ వాళ్లకు చక్కగా పోలీసులు స్వాగతం పలికారు. ఓటు వేస్తామంటూ.. కొందరు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. కోయ ప్రవీణ్.. టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావు సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ.. ఆయన బలగం ఈ ఎన్నిక నిర్వహించాయి. టీడీపీ ప్రభుత్వం మాట వినని ఐపీఎస్ అధికారులకు తప్పని వేధింపులు. బాబు మాట వినకుంటే డీజీ స్థాయి వాళ్లు కూడా జైలుకే! అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా.. క్యూ లైన్‌లో దర్జాగా నిలబడి దొంగ ఓట్లు వేసిన వాళ్ల ఫొటోలతో సహా వివరాలను వైఎస్ జగన్ చదివి వినిపించారు.