
సాక్షి, తాడేపల్లి: ఓట్ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్‌మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన.
బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ..
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?..

ఎందుకంటే.. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్ గాంధీ హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాకూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్ జగన్ అన్నారు.
ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్ అనంతరం జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జగన్ వివరించారు. ఓట్ల గోల్‌మాల్‌పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్ గాంధీని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C
— IANS (@ians_india) August 13, 2025
లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన.