
మధురాన్నం.. మా రాజు!
అన్నదానం.. ఎంతో పుణ్యకార్యం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెడితే రెండు చేతులెత్తి నమస్కరిస్తారు. ఇలా ఒకరికి కాదు... ఒక పూట కాదు... ఎంత మందికై నా, ఎన్ని రోజులైనా ఉచితంగా భోజనం పెట్టేందుకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చల్లని మనస్సుతో ముందుకొచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమానికి గుంటూరు జీజీహెచ్ వేదికగా నిలిచింది. ఈ పుణ్యకార్యాన్ని ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిన ఆ సేవలు ఎందరికో కడుపు నింపాయి.
గుంటూరు మెడికల్: కరోనా.... ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోయింది. మూడేళ్లపాటు లక్షలాదిమంది ప్రాణాలు బలి తీసుకున్న ఆ మహమ్మారి సమయంలో ఆకలి కేకలు పట్టించుకునే వారు కూడా లేరు. మరో పక్క రోగాలతో చికిత్స పొందుతున్న వారికి సహాయకులుగా వచ్చి పట్టెడు అన్నం దొరక్క ఎంతో మంది నిత్యం ఆకలితో అలమటించారు. ఆ సమయంలో పెద్దాయన మనస్సు చలించింది. తాను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండి వారి ఆకలి తీర్చలేకపోతే ఎలా అంటూ ముందుకొచ్చారు. కరోనాను లెక్కచేయకుండా రోగుల సహాయకులకు ఉచిత భోజనం దగ్గరుండి పెట్టించారు. మధురాన్నం సొసైటీ పేరుతో 2021 జులై 4న ప్రారంభించిన ఆ మహత్తర పుణ్యకార్యం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఐదో ఏడాదిలోనూ అమూల్య సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
శాశ్వత భోజనశాల ఏర్పాటు
గుంటూరు జీజీహెచ్‌కు రోజూ ఐదు జిల్లాలకు చెందిన సుమారు నాలుగు వేల మంది ఓపీ వైద్య విభాగానికి చికిత్స కోసం వస్తున్నారు. ఒక్కో రోగికి తోడుగా ఒకరు లేదా ఇద్దరు ఉంటున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగులకు ప్రభుత్వం ఉచితంగా భోజనం పెడుతుంది. సహాయకులు బయటే తినాలి. కరోనా సమయంలో జీజీహెచ్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు నాటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వచ్చారు. నాడు ఆయన చూసిన దృశ్యాలే నేడు రోగుల సహాయకుల భోజనశాల ఏర్పాటుకు, ఉచిత భోజనం పెట్టేందుకు నాంది పలికాయి. అప్పుడు హోటళ్లు మూసివేయడం, ఇళ్ల నుంచి ఆస్పత్రులకు వచ్చేందుకు ఆంక్షలు ఉండటంతో రోగుల సహాయకులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్పత్రిలో రూ.25 లక్షలతో నిర్మించిన ఏపీఎన్‌జీఓ భవనం వినియోగంలోకి రాకుండా ఉండటం ఆయన దృష్టికెళ్లటంతో వారితో సంప్రదించారు. ఓ మంచి పనికి తమ భవనం ఉపయోగపడుతుందని అసోసియేషన్ నేతలు ఆనందంగా అంగీకారం తెలిపారు. మాజీ మంత్రి దగ్గరుండి రోగుల సహాయకుల భోజనశాల నిర్మాణ పనులు చేయించారు. వేడిగా ఆహార పదార్థాలు ఉండేలా కోయంబత్తూరు నుంచి వంటి సామగ్రిని రప్పించారు. అత్యాధునిక సౌకర్యాలతో భోజనశాల సిద్ధమైంది. నిత్యం ఇంటి భోజనాన్ని తలపించేలా వేడిగా భోజనం వడ్డిస్తున్నారు.
చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు ఉచిత భోజనం
గుంటూరు జీజీహెచ్‌లో నాలుగేళ్లుగా కార్యక్రమం మధురాన్నం సొసైటీ పేరుతో పంపిణీ ప్రతి రోజూ వెయ్యి మందికిపైగా లబ్ధి ఇంటి భోజనాన్ని తలపించేలా జాగ్రత్తలు ఐదో వసంతంలోకి మహోన్నత సేవలు