
స్మార్ట్ కార్డుల ఊసే లేదు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులను స్మార్ట్‌గా దోచుకుంటున్నాయి. వాహన్ సారథి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్‌సీ, లైసెన్స్‌లు జారీ చేసేందుకు స్మార్ట్ కార్డుల పేరిట డబ్బులు ఏడాదిగా వసూలు చేస్తున్నా.. కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వాహన యజమానులకు, డ్రైవింగ్ లైసెన్స్ దారులకు స్మార్ట్ కార్డులు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికి 15 నెలలు గడుస్తున్నా స్మార్ట్ కార్డుల ఊసేలేదు. వాహనదారులు దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఆర్‌సీ, ఎల్‌ఆర్‌లకు సంబంధించి స్మార్ట్ కార్డు పేరిట ఆర్‌టీఏ అధికారులు ఆన్‌లైన్‌లో రూ.235 చొప్పున వసూలు చేస్తున్నారు. కార్డు ఫీజు రూ. 200, పోస్టు ద్వారా పంపడానికి రూ.32, ఇతరత్రా రూ.3 కలిపి వసూలు చేస్తున్నారు. స్మార్ట్ కార్డుల తయారీకి సంబంధించి కూటమి ప్రభుత్వం టెండర్లూ పిలవలేదు.
50 వేల కార్డులు అవసరం
గుంటూరు నగరం స్వర్ణభాతినగర్‌లో రవాణా శాఖ జిల్లా కార్యాలయం ఉంది. నిత్యం సుమారు 200 నుంచి 300 మంది వరకు లెర్నింగ్ లైసెన్స్ (ఎల్‌ఆర్), లైసెన్స్‌లు, ఆర్‌సీల కోసం వస్తుంటారు. కరోనా సమయంలో స్మార్ట్ కార్డుల జారీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 60 వేలకు పైగా కార్డులను వాహన యజమానుల నివాసాలకు పోస్టు ద్వారా రవాణాశాఖ చేర్చింది. తర్వాత గుంటూరు జిల్లా పరిధిలో గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలకు సంబంధించి 50 వేలకుపైగా స్మార్ట్ కార్డుల అవసరం ఉంది. అధికారులు ఎలాంటి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. స్మార్ట్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వాహన యజమానులకు ఓ కాగితం ఇచ్చి ఆర్టీఏ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. డిజిటల్ యుగంలో సైతం ఆర్‌సీ, ఎల్‌ఆర్‌లకు సంబంధించిన ఇప్పటికి కాగితాలపైనే రవాణా శాఖను నడిపించడం విస్మయాన్ని కలిగిస్తోంది. స్మార్ట్‌కార్డులు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అసమర్థతను ఇది వెల్లడిస్తోంది. దీనిపై రవాణాశాఖ అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు ఏమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాకే.. స్మార్ట్ కార్డులు మంజూరు అవుతాయని వారు చెబుతున్నారు.
లైసెన్స్, ఆర్‌సీ బుక్‌లకు ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు స్మార్ట్ కార్డులకు రూ.235 వసూలు చేస్తున్న ఆర్‌టీఏ జిల్లాలో సుమారుగా 50 వేల కార్డుల పెండింగ్ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మరింత దారుణం దీనిపై ఇప్పటివరకు అసలు చర్చించని రవాణా శాఖ డబ్బులు కట్టినా కార్డులు అందించని అధికారులు

స్మార్ట్ కార్డుల ఊసే లేదు