
ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషా బోధనపై శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా విల్ టు కెన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ ఆంగ్లభాషా బోధన శిక్షణ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులకు 40 రోజుల ఆన్‌లైన్ శిక్షణలో భాగంగా ఆదివారం ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విల్ టు కెన్ డైరెక్టర్ రామేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి తెలుగులో మాట్లాడినంత సులభంగా ఆంగ్లంలో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే విద్యాశాఖ సహాయంతో తొలుత విశాఖ, అన్నమయ్య జిల్లాలో శిక్షణను విజయవంతంగా ముగించామన్నారు. ఆన్‌లైన్ ద్వారా 9 జిల్లాల్లోని 18 వేల మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాష బోధనపై శిక్షణ అందించామన్నారు. ఇంతకు ముందు తెలంగాణలోనూ సైతం 53 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఏపీలోనూ అదే స్ఫూర్తితో శిక్షణ కొనసాగిస్తున్నట్టు వివరించారు. గుంటూరులో మూడు జిల్లాలకు చెందిన సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇందుకు సహకరించిన డీఈవో, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.