
హామీల అమలు ఎప్పుడో చెప్పాలి
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలు ఏమయ్యాయనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన ఎస్టీయూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో డీఏలు ఇస్తామని, మెరుగైన వేతన సవరణ చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమలును ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
●సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ బోధనేతర పనులు మితిమీరి, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీని ప్రభావం బోధనపై పడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే సీపీఎస్ విధానం రద్దు చేయాలని, తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
●ఏఐఎస్టీఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ 2003–డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదోతరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు.
●ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యమాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
●సంఘ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ రకరకాల యాప్‌ల పేరుతో టీచర్లు బోధనేతర పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
●సంఘ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదరి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి పొదుపు చేసుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ ఖాతాల నుంచి రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.
సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యస్. రామచంద్రయ్య, షేక్ మహబుబ్ సుభాని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ప్రసాదరావు, పల్నాడు, బాపట్ల జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్‌వీ రామిరెడ్డి, యు.చంద్రజిత్ యాదవ్, బడుగు శ్రీనివాస్, జి.అమర్నాథ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వి.భిక్షమయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.