
దేశాన్ని అగ్ర స్థానంలో నిలపాలి
గుంటూరు రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారించి నూతన ఆవిష్కరణలతో దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం చౌడవరం గ్రామంలోని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల 37వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి కూడా పాల్గొన్నారు. అతిథులను కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, సిబ్బంది స్వాగతించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ దేశంలోని 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. 2024లో ఐఐటీ గ్రాడ్యుయేట్లలో కేవలం 60 శాతం మంది మాత్రమే ప్లేస్‌మెంట్‌లు పొందడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌్ ప్రొఫెసర్ కె మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు తమ ముందున్న సమస్యలను అవకాశాలుగా మార్చుకుని విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఆర్. శైలజ, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, పాలక మండలి సభ్యుడు పి. గోపిచంద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, కళాశాల వివిధ శాఖల విభాగాధిపతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా ‘ఆర్‌వీఆర్‌జేసీ’ గ్రాడ్యుయేషన్ డే