నకిలీల పాపం.. పేదలపై ప్రతాపం
తాడేపల్లి రూరల్: మంగళగిరి పట్టణ పరిధిలోని కరూర్ వైశ్యాశ్యాంక్ శాఖ కార్యాలయం నుంచి పలువురు బంగారు రుణాలు తీసుకున్న వారికి నోటీసులు పంపించారు. ఆదివారం అదే బ్యాంక్‌పై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో బాధితులు ఆ వార్తను చూసి లబోదిబోమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. కూలీనాలీ చేసుకునేవారం ఎక్కడ నుంచి అంత డబ్బు తీసుకువచ్చి కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క బ్యాంక్ అధికారులు అది నకిలీ బంగారం అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, మరోపక్క తాకట్టు పెట్టిన బంగారు రుణం సమయం అయిపోయింది.. వెంటనే డబ్బులు చెల్లించాలని లేకుంటే ఇళ్లు, వాకిళ్లు వేలం వేసి కేసులు పెడతామంటూ బ్యాంక్ సిబ్బంది బెదిరిస్తున్నట్లు కూలీలు వాపోతున్నారు.
జరిగింది ఇదీ..!
మంగళగిరికి చెందిన రాజశేఖరరెడ్డి అనే రోజువారీ తాపీకూలీ సంవత్సరం క్రితం తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన మిగతా తాపీ కూలీలతో పాటు కూలిపనులకు వచ్చాడు. కాలక్రమేణా కొంతమందితో స్నేహం చేసి మంగళగిరి కరూర్ వైశ్యాబ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే లోన్లు ఇస్తారంటూ ఖాతాలు తెరిపించాడు. అనంతరం వారికి తెలియకుండా బ్యాంక్‌లో వారి పేరిట నకిలీ బంగారం తాకట్టుపెట్టి రూ.లక్షల్లో రుణం తీసుకున్నాడు. ఈక్రమంలో వడ్డీలు, అసలు కట్టాలంటూ బ్యాంకు అధికారులు కూలీలకు నోటీసులు పంపించసాగారు. ఇదేంటని రాజశేఖరరెడ్డిని అడిగితే మొత్తం నేను చూసుకుంటాను, మీకేం ఇబ్బంది రాదంటూ కూలీలను మభ్యపెట్టాడు. విషయం బయట పడి రాజశేఖరరెడ్డిని నిలదీయగా, విజయవాడకు చెందిన ఫైనాన్షియర్ టెక్కి ప్రకాష్ చూసుకుంటాడు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నాడని కూలీలు తెలిపారు. అనంతరం తమ దగ్గరికి మంగళగిరికి చెందిన మదన్, రాజశేఖరరెడ్డి వచ్చి మమ్మల్ని బ్యాంకుకు తీసుకువెళ్లారని, మదన్(బ్యాంక్ జ్యూయలర్ అప్రైజర్)ను చూపించి ఇతనే మనకు రుణాలు ఇప్పించేది అని, లోన్ వచ్చిన తరువాత పర్సంటేజ్ తీసుకుంటామని మమ్మల్ని నమ్మించాడని, ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు వస్తుంటే ఏమీ మాట్లాడకుండా మాపై దౌర్జన్యం చేస్తున్నాడని కూలీలు వాపోయారు.
నకిలీ బంగారమైతే ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు?
నకిలీ బంగారాన్ని నిజమైన బంగారంగా బ్యాంకు అధికారులు ఎలా తీసుకున్నారో వాళ్లు ముందు సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూలి పనులు చేసుకునే తమ దగ్గర అంత బంగారం ఎలా ఉంటుందని బ్యాంకు అధికారులు ఎందుకు ఆలోచించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. మేం ఒకవేళ ఎవరిదైనా బంగారం తీసుకువచ్చి తాకట్టు పెడితే అది నకిలీ బంగారం అని ఎందుకు చెప్పలేదంటూ నిలదీస్తున్నారు. ఇదే బ్యాంక్‌లో గత సంవత్సర కాలంలో రాజశేఖరరెడ్డితో పాటు మరికొంతమంది ఇలా నకిలీబంగారం తాకట్టు పెట్టి 45 మంది కూలి నాలీ చేసుకునేవారిచేత అకౌంట్ ఓపెన్ చేసి 147 బంగారు తాకట్టు ఖాతాలను తెరిచి తాకట్టు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
అవినీతి కంపులో మంగళగిరి కరూర్ వైశ్యాబ్యాంక్ కూలిపనులు చేసుకునేవారితో ఖాతాలు నకిలీ బంగారు ఆభరణాలతో రూ.లక్షల్లో రుణాలు మేమెక్కడా తాకట్టు పెట్టలేదంటున్న బాధితులు కీలక పాత్ర పోషించిన వడ్డీ వ్యాపారి రాజశేఖరరెడ్డి బ్యాంక్ నుంచి నోటీసులు అందడంతో లబోదిబోమంటున్న కూలీలు
నకిలీల పాపం.. పేదలపై ప్రతాపం


