డివిజన్ పరిధిలో పళ్లు రైళ్లు రద్దు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడం జరిగిందని డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–తిరుపతి(07257) ఈనెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, తిరుపతి–చర్లపల్లి(07258) రైలు ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందన్నారు. అలాగే గుంటూరు– రేపల్లె(67249), రేపల్లె–గుంటూరు(67250) గుంటూరు–రేపల్లె(67223), రేపల్లె – గుంటూరు (67224), రేపల్లె–తెనాలి(67230), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె–తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233) రేపల్లె–గుంటూరు (67234)విజయవాడ–తెనాలి(67221) రైళ్లను ఈనెల 4వ తేదీన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా తెలియజేశారు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
పుసులూరు(కాకుమాను):అప్పుల బాధతో కౌలురైతు పురుగు మందుతాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు పెదనందిపాడు మండలం పుసులూరుకు చెందిన తమటం బసవయ్య గత కొంత కాలంగా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 20 ఎకరాలు తీసుకుని మిరప, మొక్కజొన్న, శనగ, పత్తి సాగు చేపట్టాడు. అన్ని పంటలు ఆశించిన స్థాయిలో పండకపోవడం, సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రోజు మదన పడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం భార్యను వెంటపెట్టకుని పొలం వద్దకు వెళ్లాడు. అనంతరం చిన్న ఫంక్షన్ ఉందని సాయంత్రానికి ఇంటికి వస్తానని చెప్పి గుంటూరు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా స్పందన లేకపోవంతో పంట పొలాల్లో వెతికారు. గురువారం ఉదయం పుసులూరు నుంచి కట్రపాడు వెళ్లే మార్గంలో ఓ పంట పొలంలో బసవయ్య నిర్జీవంగా పడి ఉన్నట్లు మృతుని భార్య తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నరసరావుపేట రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
నరసరావుపేటటౌన్: కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నరసరావుపేట ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రైల్వేస్టేషన్, పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీచేశారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో పటిష్టవంతమైన భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు నాయ క్ తెలిపారు.


