శక్తి బృందాలు నెలకొల్పాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు రేంజ్ పరిధిలో శక్తి బృందాలను ఏర్పాటు చేసి మహిళలపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి శనివారం మంత్రి వచ్చారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురుతో ఊడ్చారు. చెత్తను ఎత్తారు. అనంతరం గుంటూరు రేంజ్‌లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాల ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అధ్యక్షత వహించారు. నేరాల నియంత్రణపై ఎస్పీలకు సూచనలు చేశారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై మాట్లాడారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల వినియోగంపై అవగాహన అవసరం అన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సఖివన్ స్టాప్ కేంద్రాలను పటిష్టం చేయాలని సూచించారు. మత్తుకు బానిసలైన వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. అనంతరం ఎస్పీలు జిల్లాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. పోలీస్ అధికారుల సంఘం నాయకులు హోంమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. పోలీస్ అసోసియేషన్ విభాగ గుంటూరు సంయుక్త కార్యదర్శి లక్ష్మయ్య, కో–ఆప్షన్ సభ్యులు కరీముల్లా, కరుణాకర్ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
రాష్ట్ర హోంమంత్రి అనిత


