రైతుల భూములపై కన్ను ?
కార్పొరేషన్‌లో పంచాయతీల విలీనం వెనుక కథ ఇదేనా.. 14 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంకు వస్తుందంటూ ఎమ్మెల్యే బూర్ల లెక్కలు.. అసలు ప్రభుత్వ భూములు లేకుండా ల్యాండ్ బ్యాంకు ఎలా వస్తుంది? రైతుల భూములు లాక్కుంటారా.. ఆందోళనలో రైతాంగం విలీనం ప్రక్రియను వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే విలీనం అయిన పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో...
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతుల భూమిపై కన్ను పడిందా? వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు పావులు కదుపుతున్నారా? గుంటూరు కార్పొరేషన్‌లో 18 గ్రామాలను విలీనం చేయాలన్న ప్రక్రియపై ఆయా గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్న భయాందోళనలు ఇవి. ఇటీవల విజయవాడ, తిరుపతి గ్రేటర్ చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాయిదా వేశారు. కొత్తగా జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ప్రకారం విలీనం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయినా గుంటూరులో మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నా కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. మొదట 11 గ్రామాల విలీనం కోసం తీర్మానం పెట్టగా, దీని ద్వారా సుమారు 14 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కార్పొరేషన్‌కు అందుబాటులోకి వస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ భూమి లేని గ్రామాలు..
నగరానికి ఆనుకుని ఉన్న తక్కెళ్లపాడు, అగతవరప్పాడు, పెదకాకాని లేకుండా మిగిలిన దూరంలో ఉన్న గ్రామాలను కలపడం ఏంటని అభ్యంతరాలు సొంత పార్టీ సభ్యుల నుంచే రావడంతో మళ్లీ తాజాగా జరిగిన సమావేశంలో మరో ఏడు గ్రామాలను కలిపి మొత్తం 18 గ్రామాలను అజెండాలో పెట్టారు. దీనివల్ల 20 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కార్పొరేషన్‌కు వస్తుందని బూర్ల రామాంజనేయులు చెబుతున్నారు. అసలు ప్రభుత్వ భూమి లేని ఈ గ్రామాలను కలపడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఎలా వస్తుంది? మా భూములు తీసేసుకుంటారా అన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందని బూర్ల తన ప్రతిపాదనలో పేర్కొనడం చూస్తుంటే ఈ గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కనపడుతోంది.
వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు...
2012లో మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిపిన గ్రామాలకే ఇప్పటి వరకు మంచినీటి సదుపాయాన్ని కల్పించడంలో కార్పొరేషన్ విఫలమైంది. అటువంటప్పుడు మరో 18 గ్రామాలను కలపడం ఉపయోగం లేదన్నది ప్రజా ప్రతినిధులు వాదన. ఈ ప్రతిపాదనను గుంటూరు తూర్పు, పశ్చిమ, పొన్నూరు ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, దూళిపాళ్ల నరేంద్ర వ్యతిరేకిస్తున్నారు. అలాగే గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయడం ద్వారా పరిపాలనా పరమైన సమస్యలు వస్తాయని తూర్పు ఎమ్మెల్యే నసీర్ వ్యతిరేకించారు.
విలీనం అయ్యే గ్రామాలివే....
లాల్‌పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చినపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తోకవారి పాలెం, గొల్లవారిపాలెం, ఓబులు నాయుడుపాలెం, జొన్నలగడ్డ, ఆగతవరప్పాడు, వెనిగండ్ల, కొర్నెపాడు, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, లాం, పెదకాకాని గ్రామాల విలీనానికి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం తీసుకోనున్నారు. 18 గ్రామాలను విలీనం చేయాలనుకున్నప్పుడు అక్కడ గ్రామ సభలు నిర్వహించి ప్రజామోదంతో పాటు పంచాయతీ తీర్మానాలు చేయాల్సి ఉంది. అయితే కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి, సర్పంచ్‌లకు తెలియకుండానే తీర్మానాలను చేసి పంపించారు. దీన్ని ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


