నంద్యాల, సూర్యాపేట ఎడ్లకు ప్రథమ బహుమతి
తెనాలి రూరల్: స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహిస్తున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన, పశు పాల ప్రదర్శన పోటీలు ముగిశాయి. గత నెల 29వ తేదీ నుంచి జరుగుతున్న పోటీల్లో చివరి రోజైన శుక్రవారం సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు. 11 జతల ఎడ్లు పోటీ పడ్డాయి. రాత్రి పొద్దు పోయే వరకు హోరాహోరీగా పోటీలు జరిగాయి. నంద్యాల జిల్లా పెదకొట్టలకు చెందిన జోరెడ్డి కేశవరెడ్డి, తెలంగాణ జిల్లా సూర్యాపేటకు చెందిన ఏఎస్పీ సుంకి సురేందర్‌రెడ్డి కంబైన్డ్ ఎడ్ల జత నిర్ణీత సమయంలో 3619.9 అడుగులు లాగి ప్రథమ బహుమతిని పొందాయి.తాడేపల్లికి చెందిన లంకిరెడ్డి నిక్షేత్‌రెడ్డి ఎడ్ల జత(3394.10 అడుగులు) రెండో బహుమతిని, ప్రత్తిపాడు మండలం పెద్దగొట్టటిపాడుకు చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్ల జత (3351.8 అడుగులు) మూడో బహుమతిని సాధించాయి. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా బెల్లెట్ బండిని అందజేశారు. పోటీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యవేక్షించారు.


