హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ నుంచి కొలనుకొండ బైపాస్‌కు వెళ్లే రహదారిలో జరిగిన హత్య కేసును తాడేపల్లి పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి బుధవారం కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఈనెల 2న అరటితోటలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతుడిని బ్రహ్మానందపురంలో నివాసించే ఇళ్లచెరువు వెంకటరావు అలియాస్ వెంకట్ (32)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న అతడి తండ్రి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి, తమ అబ్బాయిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్ర కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, టెక్నికల్‌గా కొన్ని ఆధారాలు సేకరించారు. అంజిరెడ్డి కాలనీకి చెందిన మల్లినేని సాయిభవాని, వేమూరు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
మహిళతో సంబంధం
మృతి చెందిన వెంకటరావు అంజిరెడ్డి కాలనీలో గతంలో నివసించే వాడు. అక్కడి నుంచి బ్రహ్మానందపురంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లాడు. అతడికి అంజిరెడ్డి కాలనీలో వేరే మహిళతో సంబంధం ఉండడంతో అక్కడకు వచ్చి వెళ్లే సమయంలో సాయిభవాని, మహేష్‌లతో గొడవ పడేవాడు. ఇది మనసులో పెట్టుకుని ఈనెల 20న అంజిరెడ్డి కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ మధ్యలో ఉన్న రోడ్డులో కాపుకాసి బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఐ వీరేంద్రను, ఎస్‌ఐ ఖాజావలిని, సిబ్బంది ప్రదీప్‌ను ఆయన అభినందించారు.
హత్య జరిగింది ఇలా...
బ్రహ్మానందపురంలో నివాసముండే వెంకటరావు ఈనెల 20న అంజిరెడ్డి కాలనీలోని ప్రియురాలి దగ్గర నుంచి రాత్రి 12 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో సాయి భవాని పుట్టినరోజు సందర్భంగా మహేష్, వారి చిన్ననాటి స్నేహితులు మరో ఐదుగురు మద్యం పార్టీని నడిరోడ్డులో జరుపుకుంటున్నారు. వెంకటరావు వారి వద్దకు వెళ్లి అడ్డు తప్పుకోవాలని కోరాడు. దీనికి సాయి భవాని, మహేష్‌లు ‘‘నీ కోసం ఎప్పటినుంచో చూస్తున్నామురా! ’’ అంటూ ఆటోలో కూర్చుని ఉన్న వెంకటరావును కొట్టి కిందికి దించారు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వెంకటరావును విచక్షణా రహితంగా రాళ్లతో కొట్టడం వారు గమనించారు. అదే రాత్రి ఐదుగురిలో ఒక వ్యక్తి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఏదో ఫేక్ కాల్ అని భావించి వదిలివేశారు. ఉదయం అంజిరెడ్డి కాలనీలో హత్య జరిగిందని తెలియడంతో సదరు యువకుడ్ని విచారించగా ఉదంతం బయట పడింది. అతిగా మద్యం తాగిన మత్తులో విచక్షణా రహితంగా వెంకటరావును మద్యం బాటిళ్లతో, రాళ్లతో కొట్టడంతో రోడ్డుపై మృతి చెందాడు. అనంతరం ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి పక్కనే ఉన్న అరటితోటలో పడవేశారు.


