తెనాలి మున్సిపల్‌ పీఠంపై మరోసారి బీసీ మహిళ | - | Sakshi
Sakshi News home page

తెనాలి మున్సిపల్‌ పీఠంపై మరోసారి బీసీ మహిళ

Nov 15 2023 12:52 AM | Updated on Nov 15 2023 12:52 AM

- - Sakshi

తెనాలి: మహామహులు ఏలిన తెనాలి మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌గా మరోసారి బీసీ మహిళకు దక్కనుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పట్టణ ఎనిమిదో వార్డు కౌన్సిలరు తాడిబోయిన రాధికను ఈనెల 16న ఉదయం 11 గంటలకు జరగనున్న కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంలో ఎన్నుకోనున్నారు. సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. ఈ ప్రకారం ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజారిటీ గల పట్టణ మున్సిపల్‌ కౌన్సిల్‌లో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఇచ్చిన హామీప్రకారం నూతన చైర్‌పర్సన్‌గా తాడిబోయిన రాధిక ఎన్నిక లాంఛనప్రాయమని తెలిసిందే. 1909లో ఏర్పడిన తెనాలి మున్సిపాలిటీకి తొలుత డిప్యూటీ కలెక్టర్‌ను చైర్మన్‌గా నామినేట్‌ చేస్తూ వచ్చారు. 1920 నుంచి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. తొలి మున్సిపల్‌ చైర్మన్‌గా రావుబహద్దూర్‌ చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి ఎన్నికయ్యారు. స్వాతంత్య్రయోధులు, న్యాయవాదులు, సంఘ సంస్కరణవాదులు ఎన్నికల్లో చైర్మన్‌ పదవిని చేపడుతూ వచ్చారు. తర్వాతికాలంలో చైర్మన్‌ పదవిని రాజకీయ నేతలు ఎన్నికవుతూ వచ్చారు. మున్సిపల్‌ చైర్మన్లుగా చేసిన నలుగురు అనంతరం ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఆలపాటి వెంకట్రామయ్య, అన్నాబత్తుని సత్యనారాయణ రాష్ట్ర మంత్రులుగానూ చేశారు. 114 ఏళ్ల చరిత్ర కలిగిన తెనాలి మున్సిపాలిటీలో మహిళకు చైర్‌పర్సన్‌గా అవకాశం రావటానికి సుదీర్ఘకాలం పట్టింది. 1995 ఎన్నికల్లో ఆలమూరి విజయలక్ష్మీకుమారి ఎన్నికై , తొలి మహిళా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా గుర్తింపును పొందారు. 2005లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీలకు రిజర్వు కావటంతో ఆ వర్గానికి చెందిన డాక్టర్‌ తాడిబోయిన మస్తానమ్మను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మూడేళ్ల తర్వాత అదే వర్గీయురాలైన దొడ్డక సీతామహాలక్ష్మికి అవకాశం ఇచ్చారు.

సామాజిక సాధికారతకు పెద్దపీట

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సామాజిక సాధికారతకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ముస్లిం మైనారిటీ వర్గానికి చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తానని, రెండున్నరేళ్ల తర్వాత బీసీలకు చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేలా చూస్తానని హామీనిచ్చారు. ఆ ప్రకారం తొలుత సయ్యద్‌ ఖలేదా నసీమ్‌ను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఆ పదవి వరించిన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం మళ్లీ ఇప్పుడు బీసీ వర్గీయురాలు తాడిబోయిన రాధికకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి వరించనుంది. రాధిక, ఆమె భర్త తాడిబోయిన రమేష్‌లు రెండు దశాబ్దాలుగా మున్సిపల్‌ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తాడిబోయిన రమేష్‌ రెండు పర్యాయాలు కౌన్సిలరుగా చేయగా, రాధిక రెండో పర్యాయం కౌన్సిలరుగా ప్రస్తుత కౌన్సిల్‌లో ఉన్నారు. బీసీ వర్గంతోపాటు అనుభవానికి ప్రాధాన్యతగా చైర్‌పర్సన్‌ పదవికి ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాల్లో ఉంది.

16న కౌన్సిల్‌ సమావేశం

చైర్‌పర్సన్‌ ఎన్నిక

కౌన్సిలరు తాడిబోయిన రాధిక

ఎన్నిక లాంఛనమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement