Brain Dead Man's Organs Donated In Vijayawada - Sakshi
Sakshi News home page

దినేష్‌.. నీ త్యాగం చిరస్మరణీయం !

Jul 21 2023 1:04 AM | Updated on Jul 21 2023 3:09 PM

- - Sakshi

వైద్యపరీక్షల అనంతరం బ్రెయిన్‌ డెడ్‌గా గుర్తించారు. దినేష్‌ భార్య వసంత, తండ్రి ఏడుకొండలు, తల్లి సుశీల అంగీకారం

తాడేపల్లి రూరల్‌: అవయవదానం చేసి నలుగురికి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడికి మణిపాల్‌ యాజమాన్యం గురువారం ఘన నివాళులర్పించింది. విజయవాడ విద్యాధరపురానికి చెందిన వుజ్జురి దినేష్‌(22) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో మణిపాల్‌ ఆసుప్రతికి తీసుకు వచ్చారు. ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు క్రేనియోటమీ శస్త్ర చికిత్సను నిర్వహించారు.

అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు. వైద్యపరీక్షల అనంతరం బ్రెయిన్‌ డెడ్‌గా గుర్తించారు. దినేష్‌ భార్య వసంత, తండ్రి ఏడుకొండలు, తల్లి సుశీల అంగీకారం మేరకు జీవన్‌ధార్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె. రాంబాబు, మణిపాల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడిల ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. దినేష్‌ కాలేయం, కిడ్నీని మణిపాల్‌ ఆసుపత్రిలోని అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా అమర్చినట్లు మణిపాల్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

కళ్లను వి.ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు, లంగ్స్‌ను కిమ్స్‌ (సికింద్రాబాద్‌), ఒక కిడ్నీని విజయ హాస్పిటల్‌(విజయవాడ)కు తరలించామని వివరించారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన దినేష్‌ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement