ప్రజాస్వామ్యంలో ఏఐ పాత్ర | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఏఐ పాత్ర

Published Wed, Mar 20 2024 12:02 AM

Sakshi Guest Column On role of AI in democracy

అభిప్రాయం

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) తన మొదటి ప్రధాన నైతిక పరీక్షను ఎదుర్కొనే సంవత్సరంగా ఈ 2024 ఉండబోతోంది. ఈ సంవత్సర ప్రారంభంలో బంగ్లాదేశ్, స్లొవేకియాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులను దెబ్బగొట్టడానికి ‘డీప్‌ ఫేక్‌’ను వాడుకున్నారు. అదే సమయంలో, జైలు నుంచే ఇమ్రాన్‌ ఖాన్‌ తన ఓటర్లకు పిలుపునివ్వడంలో కూడా జెనరేటివ్‌ ఏఐ సాయపడింది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పాత్రకు భిన్నంగా కృత్రిమ మేధను ఎలా ఉపయోగించుకోవచ్చో పాకిస్తాన్‌ చేసి చూపించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ చాలా సాయపడగలదు. తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహించుకోవడంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడగలదు.

గత రెండేళ్లుగా, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ)... దాని ద్వారా ఉత్పన్నమైన ఉత్సాహం, అది కలిగించిన అంతరాయాలపై సాంకేతిక కథనాలు ఆధిపత్యం చలాయించాయి. కాపీరైట్, పక్షపాతం, గోప్యత, డీప్‌ఫేక్‌ (వ్యక్తుల వాస్తవ చిత్రాన్ని మార్చి అప్రతిష్ఠకు పాల్పడటం) వంటి నైతిక సమస్యలు ఎదురు కావడంతో, 2023 చివరి భాగంలో ఈ కథనాలు కొద్దిగా పసలేనివిగా మారిపోయాయి. ఇప్పుడు, చాలా దేశాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి సహాయపడినా లేదా దానిని నాశనం చేసినా... కృత్రిమ మేధస్సు తన మొదటి ప్రధాన నైతిక పరీక్షను ఎదుర్కొనే సంవత్సరంగా 2024 ఉండబోతోంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, ఇతర ప్రధాన ప్రజాస్వామ్య దేశాలు ఈ సంవత్సరం కీలకమైన ఎన్నికలకు వెళుతున్నాయి. జనరేటివ్‌ ఏఐ కంటే ముందే డీప్‌ఫేక్‌లు ఉనికిలో ఉన్నప్పటికీ – ‘సోరా’, ‘స్టేబుల్‌ డిఫ్యూజన్‌’ వంటివి వాటి ఉత్పత్తిని ప్రజాస్వామీకరించాయి. వాటిని సులభంగా, వేగంగా, చౌకగా మార్చేశాయి.

వాట్సాప్, టిక్‌ టోక్‌ మొదలైనవి అంతర్జాతీయ పంపిణీని అత్యంత సులభంగా మార్చేయడంతో సోషల్‌ మీడియాకు సంబంధించి శిఖరస్థాయి దశలో ఉన్నాం. బంగ్లాదేశ్, స్లొవేకియా ఈ సంవ త్సరం ప్రారంభంలో ఎన్నికలకు వెళ్లాయి. ఈ సందర్భంగా చాలా డీప్‌ఫేక్‌లు వచ్చాయి. బంగ్లాదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు పాలస్తీనియన్లకు తన మద్దతు విషయంలో సందిగ్ధంగా ఉన్నట్లు చూపటం జరిగింది. ఇది ఆ దేశంలో ఒక వినాశకరమైన వైఖరి.

స్లొవేకియా ఎన్నికలలో, ఒక ప్రధాన పోటీదారు ఎన్నికల రిగ్గింగ్‌ గురించి, మరింత ప్రమాదకరంగా బీరు ధరను పెంచడం గురించి మాట్లాడినట్లు చూపారు. ఇది ఆయన ఓటమికి కారణమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నకిలీ వాయిస్‌ అమెరికా ప్రైమరీలలో ఓటు వేయవద్దని ప్రజ లను కోరింది. 2016 కేంబ్రిడ్జ్‌ అనలిటికా(డేటా స్కాండల్‌) వైఫల్యానికి చెందిన జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్నాయి. పెద్ద ఎన్నికలు సమీపి స్తున్నందున ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

అయినప్పటికీ, నేను ఇక్కడ భిన్న వైఖరిని తీసుకుంటాను. పాకిస్తాన్‌ వైపు చూడండి. అక్కడ మాజీ ప్రధాని జైల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. ఆయన పార్టీ గుర్తులు లాక్కుని, వారి అభ్యర్థులను నిర్బంధిస్తామని బెదిరించారు. చివరికి ఇతర పార్టీలు గెలిచినట్లు ప్రకటించినప్పటికీ, భారీ రిగ్గింగ్, అవకతవకలు జరిగి నప్పటికీ ఇమ్రాన్‌  ఖాన్‌ పార్టీకి కచ్చితమైన మెజారిటీ వచ్చిందని చాలా నివేదికలు పేర్కొన్నాయి.

కటకటాల్లో ఉండి కూడా, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనరేటివ్‌ ఏఐని ఉపయోగించుకోవడం ద్వారా, ప్రజాస్వామ్యాన్ని అణచివేశానని తనపై వచ్చిన కథనాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ వమ్ముచేయగలిగారు. తన ఓటర్లను బయటకు వచ్చి తన పార్టీకి ఓటు వేయమని ఇమ్రాన్‌ కోరిన దృశ్యాలను రూపొందించడానికి జనరేటివ్‌ ఏఐని ఉపయోగించుకున్నారు. ఇది యూట్యూబ్‌తోపాటు ఇతర ఆన్‌ లైన్‌ ఛానెళ్లలో విస్తృతంగా షేర్‌ అయింది. ప్రజలు ఆయన పిలుపును విని రికార్డు సంఖ్యలో బయటకు వచ్చారు. ఆయన అభ్య ర్థులకు ఆశ్చర్యకరమైన విజయాలు అందించారు. ప్రజాస్వా మ్యాన్ని నాశనం చేసే పాత్రకు భిన్నంగా, కృత్రిమ మేధస్సును ఎలా ఉప యోగించుకోవచ్చో పాకిస్తాన్‌ చేసి చూపించింది.

డీప్‌ఫేక్‌ల విధ్వంసక శక్తిని నేను తిరస్కరించడం లేదు. భారత్‌లో, ఇతర దేశాల్లోని ఎన్నికలలో చర్చను ప్రేరేపించడానికీ, కథనాలను రూపొందించడానికీ వాటిని ఉపయోగిస్తారని నేను భయ పడుతున్నాను కూడా. అయినప్పటికీ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ చాలా సాయపడగలదు. పాకిస్తాన్‌ ఉదాహరణ దీనికి సంబంధించి ఒక సృజనాత్మక మార్గం. ఎన్నికల్లో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని, సమర్థతను పెంపొందించడానికి కూడా ఏఐని ఉపయోగించవచ్చు.

దాని అధునాతన డేటా విశ్లేషణ సామర్థ్యాలు ఎన్నికల సంబంధిత డేటాను నిజ సమయంలో పర్యవేక్షించగలవు. మోసపూరిత కార్యా చరణను సూచించే ఏవైనా అవకతవకలను ఇట్టే గుర్తించగలవు. ఏఐ అల్గారిథమ్‌లు ఓటరు నమోదులు లేదా బ్యాలెట్‌ సమర్పణలో అక్ర మాలకు సంబంధించిన నమూనాలను గుర్తించగలవు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ సిస్టమ్‌ల భద్రతను కూడా ఏఐ మెరుగు పరుస్తుంది. అదనంగా, ప్రమాదాలను కనిపెట్టే అల్గారి థమ్‌లు... సంభవించగల సైబర్‌ ప్రమాదాలను గుర్తించడంలో కూడా సహాయపడతాయి.

స్థానిక సమస్యలపై దృష్టి సారించే అభ్య ర్థులపై, వారి మాని ఫెస్టోలపై ప్రజల స్థానిక మాండలికాలలో అత్యంత సున్నితమైన వ్యక్తిగత కంటెంట్‌ని రూపొందించడంలో జెనరేటివ్‌ ఏఐ సహాయ పడుతుంది. తద్వారా ఓటరు అవగాహనను నవీకరించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా వ్యక్తిగతీకరించిన విధానం విస్మృత వర్గాల్లో రాజకీయ అవగాహనను పెంపొందించగలదు. దీన్ని అధిక సామర్థ్యంతో చాలా తక్కువ ఖర్చుతో చేయ డంలో జెనరేటివ్‌ ఏఐ ఉపయోగపడుతుంది. తద్వారా తక్కువ డబ్బు ఉన్న అభ్యర్థులకు కూడా అధికారం లభించేలా చేస్తుంది.

కృత్రిమ మేధతో నడిచే వ్యవస్థలు వైకల్యాలున్న ఓటర్లకు ప్రాప్యతను కూడా మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు, అతిశక్తిమంతమైన వాయిస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌లు దృష్టి లోపం ఉన్న ఓటర్లకు సహాయపడతాయి. రాజకీయ సంభాషణలో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, జన సమూహాలలో ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి కూడా కృత్రిమ మేధను అన్వయించవచ్చు.

ఎన్నికల నిర్వహణ లాజిస్టిక్స్‌ వంటివాటిని కూడా అనుకూలపర్చవచ్చు. ఖర్చులు ఆదా చేయవచ్చు. ఇది భారతదేశం వంటి పెద్ద దేశాలకు చాలా ముఖ్యమైనది. ఓటరు నమోదును, ధ్రువీ కరణను మరింత సమర్థవంతంగా చేయడంలో కృత్రిమ మేధ సహాయపడుతుంది. అర్హతను ధ్రువీకరించడానికి అవసరమైన డేటాను సరైన సమయంలో విశ్లేషించడం ద్వారా పొడవాటి క్యూలు లేకుండా చేస్తుంది.

చివరగా, కృత్రిమ మేధ అనేది ద్వంద్వ వినియోగ సాంకేతికతను కలిగివున్నది. అపారమైన విధ్వంసక శక్తితో పాటు భారీ ప్రయో జనాలను ఇది కలిగి ఉంది. ఎన్నికలపై దాని ప్రతికూల ప్రభావాన్ని డీప్‌ఫేక్‌ల రూపంలో మనం చూడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మన ప్రజాస్వామ్యాలను అది ఎలా మెరుగుపరుస్తుందో కూడా చూడాలి. పర్ఫెక్టుగా లేకపోయినా, ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ ఈ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపడంలో విజయం సాధించింది.

జస్‌ప్రీత్‌ బింద్రా 
వ్యాసకర్త సాంకేతికాంశాల మేధావి
(‘ది మింట్‌’ సౌజన్యంతో)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement