వేడికొద్దీ వానలు

Sakshi Guest Column On Rainfall In India

విశ్లేషణ

ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలలో వర్షపాతం మామూలు కన్నా తక్కువగా ఉంటుందని సూచనలు వచ్చాయి. ఈ సూచనలు మొత్తం దేశానికి వర్తిస్తాయని చెప్పుకోవాలి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వారి వాతావరణ శాఖ మాత్రమే కాక స్కైమెట్‌ అనే ఒక ప్రైవేట్‌ సంస్థ కూడా వాతావరణం గురించి పరిశోధనలు చేసి సూచనలు అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థవారు నిజానికి ఈ సంవత్సరం వర్షపాతం దేశం మొత్తం మీద మామూలుగా 94 శాతం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. మళ్లీ ఈ అవకాశం 40 శాతం ఉంటుందని కూడా అన్నారు.

వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేము అన్న మాట ఇక్కడ బహుశా గుర్తు చేసుకోవాలేమో? ఉత్తర భారత దేశం, దేశంలోని మధ్య ప్రాంతాలలో ఈ ప్రభావం
మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మామూలు గానే ప్రపంచమంతటా వాతావరణం వేడెక్కుతోంది. హిందూ మహాసముద్రంలో డైపోల్‌ అనే పరిస్థితి ఒక పక్కన, అనుకున్న దానికన్నా ముందే వచ్చిన ఎల్‌ నినోలు మరోపక్కన ఇందుకు కారణం అని చెబుతున్నారు. 

తూర్పు ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న శాంతి మహా సముద్రం అనే పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత సగటు కన్నా అర డిగ్రీ ఎక్కువయినందుకు ఎల్‌ నినో వస్తుంది. అన్నట్టు ఈ మాటలోనే చివరి అక్షరానికి ‘య’ ఒత్తు ఇచ్చినట్టు పలకాలట. మాటకు చిన్న బాబు అని అర్థం. ఈ పరిస్థితి ముందు అనుకున్న దానికన్నా రెండు నెలలు ముందే వచ్చేసింది. అంతకుముందు మూడు సంవత్సరాల పాటు లా మీనా అనే పరిస్థితి.

అంటే ఇందుకు వ్యతిరేకమైన పరిస్థితి ఉండేది. సముద్రం పైభాగంలో నీళ్లు వేడెక్కడం, చల్లబడడం అనే ఈ రెండు పరిస్థితులు మూడు నుంచి ఏడేళ్లకు ఒకసారి మారుతుంటాయి. 

ఒక పక్కన మానవ కార్యక్రమాల వల్ల వాతావరణం వేడెక్కుతున్నది. దానికి తోడుగా ఈ పరిస్థితులు కూడా వచ్చేసరికి మొత్తం ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పగడపు కొండలన్నీ పాడై పోతాయి. అనుకోని పద్ధతిలో వరదలు వస్తాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగే పరిస్థితులు వస్తాయి. ఎల్‌ నినో లేకుండానే వాతావరణ పరిస్థితి దారుణంగా ఉంది, ఇక ఇది కూడా తోడైతే ఏమవుతుందో అంటున్నారు పరి శోధకులు పెడ్రో డి నేజియో. 

2015 – 16 ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి బలంగా వచ్చింది. పసిఫిక్‌ సముద్రంలో పెద్ద ఎత్తున వేడి చేరుకున్నది. ఇందులో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం కూడా కొంత ఉంది. ఇప్పుడిక సముద్రం మీద మూత తీసివేసినట్లే అంటారు యూఎస్‌ సంస్థ ‘ఎన్‌ఓఏఏ’ పరిశోధకులు మైఖేల్‌. సముద్రోపరితలంలో చేరిన వేడి ప్రభావం ఇప్పటికే ప్రపంచం మీద ప్రభావం చూపు తున్నది. 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలు ఎక్కువయ్యే అవకాశం నిండుగా ఉంటుంది అంటున్నారు ఈయన. 

సాధారణంగా ఈ వేడి కారణంగా తూర్పు వ్యాపార పవనాల మీద ప్రభావం ఉంటుంది. కనుక వేడి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు ఆ గాలుల వేగంలో అంతగా మార్పు కనిపించలేదు అని పరిశీలకులు గమనించారు. ప్రస్తుతం వచ్చిన పరిస్థితి వచ్చే ఫిబ్రవరి దాకా బలంగా కొనసాగుతుంది. కనుక సముద్రం మీద నుంచి వచ్చే వ్యాపార పవనాలను అక్కడి వేడి ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్‌ కల్లా ఈ పరిస్థితి గురించి మరింత మంచి అవగాహన అందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎల్‌ నినో బలంగా ఉన్నా లేకున్నా వరదలు, ఉత్పాతాలు మాత్రం తప్పవు. 

ఎల్‌ నినో వల్ల మంచి కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఆఫ్రికా లోని కరవు ప్రాంతాలలో వర్షాలు వస్తాయి. అక్కడి ఆకలిగా ఉన్న జనాలకు తిండి దొరుకుతుంది. మొత్తం మీద మాత్రం ప్రభావాలు వ్యతి రేకంగా మాత్రమే ఉంటాయనీ, ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉండక తప్పదనీ పరిశోధకులు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తులలో ఐదు శాతం తగ్గింపు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ తెలివి తెచ్చుకుని, వాతావరణం వేడెక్కకుండా ఉండే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి.

డా‘‘ కె.బి. గోపాలం 
వ్యాసకర్త సైన్స్‌ విషయాల రచయిత, అనువాదకుడు
మొబైల్‌: 98490 62055

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top