ద్రవ్యోల్బణం మార్కెట్‌కా, మందికా? | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం మార్కెట్‌కా, మందికా?

Published Fri, Oct 20 2023 12:10 AM

Sakshi Guest Column On Inflation, Commodity Production Markets

ఒకప్పుడు ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రామిక సరుకు ఉత్పత్తి, సేవారంగాలు ఆర్థిక వ్యవస్థలో పైచేయిలో ఉండేవి. కానీ 1980ల అనంతరం, ఈ రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్‌ రంగానిది పైచేయి అయింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. దీంతో ఎటువంటి ఉత్పత్తి లేకుండా డబ్బును మరింత డబ్బుగా మార్చే రియల్‌ ఎస్టేట్, షేర్‌ మార్కెట్ల హవా పెరిగింది. ఈ నేపథ్యంలో, షేర్‌ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అయింది. పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్‌ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది.

కొద్ది రోజుల క్రితం, అమెరికాలో నెలవారీ ఉపాధి కల్పన గణాంకాలు ఊహించిన దాని కంటే మెరుగైనవిగా వెలువడ్డాయి. కానీ ఈ వార్త అమెరికా షేర్‌ మార్కెట్‌ సూచీలలో పతనానికి కారణమైంది. నిజానికి, మార్కెట్‌ విశ్లేషకులు చెప్పే ఫండమెంటల్స్‌ బాగుంటే, అది షేర్‌ మార్కెట్‌ సూచీలలో పెరుగుదలకు కారణం కావాలి. పైన జరిగింది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. ఇక్కడ ఉపాధి కల్పన గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.

అంటే, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, ప్రజల కొనుగోలు శక్తి బాగున్నాయన్నమాట. ఇదే, వాస్తవంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలిక అంశాలు లేదా ఫండమెంటల్స్‌ బాగుండటం అంటే. ఇది, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. ఈ స్థూల ఆర్థిక వ్యవస్థ బాగున్నదంటే దానిలో అంతర్భాగమైన వివిధ రంగాలకు చెందిన సంస్థలూ, పరిశ్రమలూ, ఇతరత్రా వ్యాపారాల ఫండమెంటల్స్‌ కూడా బాగున్నట్లే. మరి అటువంటప్పుడు అమెరికా షేర్‌మార్కెట్లు ఎందుకు పతనం అయినట్లు? 

ఇక్కడ గమనించవలసింది 1980ల అనంతరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మౌలికంగా జరిగిన మార్పులను. ఈ మార్పులు, మనం పైన చెçప్పుకున్న ఫండమెంటల్స్‌కు భిన్నమైన వాతావరణాన్ని తెచ్చి పెట్టాయి. ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రా మిక సరుకు ఉత్పత్తి, సేవారంగాల (నిజ ఆర్థిక వ్యవస్థగా పిలవ బడేవి) కంటే... అటువంటి రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్‌ రంగానిది పైచేయి అయింది. నిజ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్స్‌ ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ విధంగా సమతూకం మారింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. 

ఈ క్రమంలోనే, ఎటువంటి ఉత్పత్తి లేకుండానే  కేవలం డబ్బును మరింత డబ్బుగా మార్చివేసే రియల్‌ ఎస్టేట్, షేర్‌ మార్కెట్ల వంటి సట్టా వ్యాపార రంగాలది పైచేయి అయ్యింది. ఇటువంటి పరిస్థితిలో, షేర్‌ మార్కెట్‌కు సంబంధించి కూడా ఫండమెంటల్స్‌ ఏవి అన్నది పూర్తిగా మారిపోయింది. ఈ కారణం చేతనే అమెరికాలో అంచనా కంటే మెరుగ్గా ఉన్న ఉపాధి గణాంకాలు మార్కెట్ల పతనానికి కారణం అయ్యాయి. అయితే, ఈ సరికొత్త ఫైనాన్స్‌ రంగ ఫండమెంటల్స్‌ తాలూకు ఏ పనితీరు ఈ మార్కెట్ల పతనానికి దారితీసింది అన్నది ఇక్కడి ప్రశ్న.

షేర్‌ మార్కెట్ల వంటి ఈ ఫైనాన్స్‌ రంగాలలో, మదుపుదారులు పెట్టిన పెట్టుబడి విలువను కాపాడుకోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ షేర్‌ మార్కెట్లలో కొంత మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టినప్పుడు, అది దాని నుంచి లాభాలను ఆశిస్తుంది. లాభాల సంగతి కాసేపు పక్కన పెట్టినా, కనీసం తను పెట్టిన పెట్టుబడి తాలూకు విలువను కాపాడుకోవాలని కోరుకుంటుంది. దీనికోసం మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలి. అది తీవ్ర ఒడుదుడుకులకు లోనవ్వడం లేదా క్షీణించడం జరగకూడదు. ఇది, షేర్‌మార్కెట్ల పెట్టుబడుల తాలూకు ప్రధాన అవసరం.

మరి ఇక్కడ కరెన్సీల విలువల పతనానికి కారణంగా లేదా దాని వ్యక్తీకరణగా ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. ఒక కరెన్సీ విలువ తగ్గినప్పుడే, దాని కొనుగోలు శక్తి తగ్గుతుంది. కరెన్సీ తాలూకు ఈ కొనుగోలు శక్తి తగ్గుదలనే ద్రవ్యోల్బణం అంటాం. ఈ నేపథ్యంలోనే, షేర్‌ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు గానూ ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అవసరంగా మారింది.

ఫలితంగానే, ఫైనాన్స్‌ పెట్టుబడుల ఆధిపత్యం పెరిగిన 1980ల అనంతరం, అంటే సుమారుగా 1990ల నుంచీ ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులూ ద్రవ్యోల్బణం అదుపును తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. ఉదాహరణకు మన రిజర్వ్‌ బ్యాంకుకు ఈ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యం, రెండు శాతం అటూ ఇటుగా నాలుగు శాతంగా నిర్ణయించబడింది. అంటే, మన దేశీయ రిజర్వ్‌ బ్యాంక్, దేశంలో ద్రవ్యోల్బణాన్ని 26 శాతం నడుమన నియంత్రించి ఉంచాలి. అలా అయితేనే భారత షేర్‌ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడుల విలువకు కాస్త భరోసా ఉంటుంది.

ఇక్కడ మరో ఉదాహరణగా అమెరికా నుంచి భారతదేశ షేర్‌ మార్కెట్లలోకి ఒక అంతర్జాతీయ ఫైనాన్స్‌ సంస్థ డాలర్లను పెట్టుబడిగా తెచ్చింది అనుకుందాం. ఆ సంస్థ డాలర్లను నేరుగా పెట్టుబడిగా పెట్టలేదు. దానికోసం కరెన్సీని రూపాయలలోకి మార్చుకుంటుంది. ఇక, ఆ సంస్థకు కీలక ప్రాధాన్యత గల అంశంగా రూపాయి విలువ కాపాడబడటం అనేది ఉంటుంది. ఆ విదేశీ మదుపు సంస్థ, తన షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులను అమ్ముకుని దేశం నుంచి మరోచోటకి వెళ్ళిపోయే నాటికి రూపాయి విలువ  గణనీయంగా తగ్గిపోయి ఉంటే అది పెట్టుబడి + లాభాల విలువ తగ్గుదలకు కారణం అవుతుంది.

మార్కెట్‌లో తన పెట్టుబడులను అమ్మివేసినప్పుడు ఆ మదుపు దారుడికి రూపాయల్లో డబ్బు వస్తుంది. తిరిగివెళ్ళిపోయే క్రమంలో రూపాయలను వేరే దేశంలోకి తీసుకుని వెళ్ళలేడు గనుక తిరిగి ఆ మదుపుదారుడు తనకు లభించిన రూపాయలను డాలర్లుగా మార్చుకుంటాడు. ఇక్కడ అతను పెట్టుబడి పెట్టేనాటికీ, వాటిని అమ్ముకుని వెనక్కు వెళ్ళేనాటికీ మధ్యన రూపాయి విలువ తగ్గితే, అతనికి ఈ రూపాయలను తిరిగి డాలర్లుగా మార్చుకుంటే, లభించే డాలర్ల మొత్తం కూడా తక్కువగానే వుంటుంది.

ఈ మొత్తం పరిస్థితిని మదింపు చేసుకోవడం కోసమే  మన దేశంలోకి లేదా ఇతరేతర దేశాలలోకి కూడా పెట్టుబడులను తీసుకువెళ్ళే మదుపుదారులు వాటిపై లభించే లాభాలను అటు, ఆ దేశం తాలూకు కరెన్సీలతో పాటుగా, మరొక కొలబద్ద అయిన డాలెక్స్‌ (డాలర్లలో లభించిన లాభం ) రూపంలో కూడా లెక్కించుకుంటారు. అదీ కథ!

కాబట్టి, నేటి ఫైనాన్స్‌ యుగంలో ఫండమెంటల్స్‌ అనేవాటి అర్థం మారిపోయింది. నేడు ఫండమెంటల్స్‌గా పరిగణించబడుతున్నవి ప్రధానంగా ఫైనాన్స్‌ పెట్టుబడుల కొలబద్ద అయిన ద్రవ్యోల్బణం సూచీలు. ఈ కారణం చేతనే, అమెరికాలో ఉపాధి కల్పన బాగా జరిగిన క్రమంలో షేర్‌ మార్కెట్లు దిగజారాయి. ఇక్కడ, మరో చిన్న విషయం... ఈ  మార్కెట్లు ఆ రోజు మధ్యాహ్నానికి తిరిగి కాస్త కోలు కున్నాయి.

దీనికి కారణం, ఈ మెరుగైన ఉపాధి గణాంకం అనేది, వేతనాల పెరుగుదల రూపంలో పెద్దగా ప్రభావం చూపలేదు. అంటే, ఉపాధి మెరుగ్గానే కనబడిందిగానీ... దాని వలన వేతనాల మొత్తం పెరిగిపోయి అది మార్కెట్లో పెరిగిన ప్రజల కొనుగోలు శక్తీ లేదా డిమాండ్‌ రూపంలో ప్రభావం చూపగలిగిందిగా లేదన్నమాట. ఈ వాస్తవాన్ని మధ్యాహ్నానికి గ్రహించిన అమెరికా మార్కెట్‌ సూచీలు తిరిగి మళ్ళీ పుంజుకున్నాయి. ప్రజల కొనుగోలుశక్తీ, లేదా డిమాండ్‌ పెరగకుంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగదనే సూక్ష్మమే దీనికి కారణం.

1980ల ముందరినాటి కాలం ఫండమెంటల్స్‌ వేరుగా ఉన్నాయి. అవి, ఒక కంపెనీ తాలూకు బ్యాలెన్స్‌ షీట్, అలాగే స్థూలంగా నిజ ఆర్థిక వ్యవస్థ తాలూకు బలంపై ఆధారపడి వున్నాయి. కానీ నేడు అది పూర్తిగా నిజంకాదు. ద్రవ్యోల్బణం, దాని కట్టడి అనేవి నేడు మార్కెట్లో ప్రధాన అంశంగా మారింది. కాబట్టి నేడు వివిధ దేశాలలో పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్‌ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. వినాశ కాలే విపరీత బుద్ధి... ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు!
డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు
మొబైల్‌: 98661 79615

 
Advertisement
 
Advertisement