అభిప్రాయం
దేశంలో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలు మొదలైన తర్వాత మార్కెట్‌లు మెరుగయ్యాయి. పెట్టుబడుల సమీకరణలో రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పురోగతి కనిపించింది. అయితే అదే సమయంలో ఈ అభివృద్ధి సమాజంలో అంద రికీ సమానంగా అందుతోందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది! మార్కెట్ శక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్లిన తర్వాత రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అనేక వ్యత్యాసాలు కనిపించటమే ఆ ప్రశ్నకు కారణం. ఆధునిక సాంకేతికత, రహదారులు, విద్యుత్తు, భవనాల వంటి మౌలిక వసతులు ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రమే విదేశీ, స్వదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించగలిగాయి. అక్కడ పరిశ్రమలు,ఐటీ వంటి సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందటం వల్ల ఆ కొన్ని రాష్ట్రాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన ఇంజన్లుగా మారిపోయాయి. మిగిలినవి వెనుకబడి పోతున్నాయి.
సంపన్న రాష్ట్రాలకే పెట్టుబడులు
దేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందటం (ప్రాంతీయ సమతౌల్యం) అనేది ఒకప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్ల వల్ల కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందాయి. దాంతో అభివృద్ధి అన్నది కొన్ని రాష్ట్రాలకే పరిమితమైపోయింది. ఉదా: తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నగరీకరణ విస్తృతమవటం, మెరుగైన వసతులు ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు సమృద్ధిగా సమకూరుతున్నాయి. గుజరాత్‌లో రేవులు, మహారాష్ట్రలో రవాణా వ్యవస్థలు, తమిళనాడులో ఫ్యాక్ట రీలు, కర్ణాటకలో ఐటీ పార్కులు, ఢిల్లీలో భారీగా రిటైల్ వ్యాపారాలు ఉండటంతో ఆయా రాష్ట్రాలు అభివృద్ధి పోటీలో ముందుంటు న్నాయి. ఈ పోటీ వల్ల కేవలం ఆర్థికంగా ఎదగటమే ప్రధానం అయింది కానీ, సమాజంలో అందరికీ సమాన న్యాయం జరగడం లేదు. ఎక్కువ సంపాదన ఉన్న రాష్ట్రాల్లో కూడా ధనిక, పేద అసమా నతలు పెరిగిపోతున్నాయి. ఈ వృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి.
ఆర్థికంగానే కాకుండా అక్షరాస్యత, ఉన్నత విద్య, ఆసుపత్రుల అందుబాటు, పౌష్టికాహారం వంటి విషయాల్లో కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి. నగరాలు, కర్మాగా రాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అవకాశాలు పెరగడంతో, వెనుక బడిన రాష్ట్రాల నుండి ప్రజలు అక్కడికి వలస వెళుతున్నారు. నైపుణ్యం ఉన్న శ్రామికులు, ఎక్కువ డబ్బు ‘ఇవ్వగల’ రాష్ట్రాలకే వెళ్తుండటంతో మిగతా ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్.) ప్రకారం 2017–2018 నుండి 2023–2024 మధ్యకాలంలో దేశంలో ధనిక, పేద ప్రజల మధ్య ఆదాయ అసమానతలు బాగా పెరిగాయి. ‘జినీ ఇండెక్స్’ సూచీని అనుసరించి హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ఆదాయ అసమా నతలు మిజోరాం, బిహార్, మణిపుర్, గోవాలలో నమోదయ్యాయి. విద్య, పరిశ్రమలు, రోడ్ల వంటి సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల 2025లో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్‌లో పేదరికం ఎక్కు వగా ఉంది. అదే సమయంలో మంచి వసతులు, విద్యాలయాలు, నగరాలు ఎక్కువగా ఉండటం వల్ల కేరళ, గోవా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లలో పేదరికం స్థాయి తక్కువగా ఉంది.
‘సంపాదన’ ఉన్నా... తప్పని నిరుద్యోగం
వ్యాపారాలు, సంపాదన బాగున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పేదరికాన్ని తగ్గించగలిగాయి కానీ, నిరుద్యోగాన్ని మాత్రం ఆపలేకపోయాయి. 2025–26 మొదటి అర్ధభాగంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ వంటి చోట్ల నిరుద్యోగం ఎక్కువగా ఉంటే; గుజరాత్, జార్ఖండ్, కేరళ యూపీ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కేరళ, హరియాణా రాష్ట్రాల్లో ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు బాగున్నా అక్కడ కూడా నిరుద్యోగం ఎక్కువే ఉంది. ఇక ఆసుపత్రులు, ఆరోగ్య వసతులకు గుర్తింపుగా చూసే ‘శిశు మరణాల రేటు’ (పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో చనిపోయే వారి సంఖ్య) ఛత్తీస్‌గఢ్‌లో 36, ఉత్తరప్రదేశ్‌లో 35, మధ్యప్రదేశ్‌లో 35 గా ఉంది. అదే, కేరళలో కేవలం 8, తమిళనాడు, ఢిల్లీలలో 11 గా ఉండి ఆ రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం విషయానికి వస్తే, పి.ఎల్.ఎఫ్.ఎస్. 2023–24 ప్రకారం జాతీయ స్థాయిలో పురుషులు 76.3 శాతం మంది పని చేస్తుంటే, మహిళలు కేవలం 40.3 శాతం మందే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రేటు ఢిల్లీ, పంజాబ్, యూపీలలో మరీ తక్కువగా ఉంది. చదువు విషయా నికొస్తే మాత్రం కాలేజీల్లో చేరే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య దాదాపు సమానంగా ఉండి, చదువుల్లో అసమానతలు తగ్గినప్పటికీ, మధ్యలోనే స్కూళ్లు కాలేజీలు మానేస్తున్న వారి సంఖ్య పెరగడం దేశానికి పెద్ద సవాలుగా మారింది.
సహకారంతోనే సమ్మిళిత వృద్ధి
మార్కెట్ ఆధారిత వ్యవస్థల వల్ల ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు సమాజానికి అవసరమైన విద్య, వైద్యం వంటి వాటిపై తగినంతగా ఖర్చు పెట్టకపోవడం వల్ల మానవాభివృద్ధి వెనుకబడిపోతోంది. కనుక, ప్రభుత్వాలు కేవలం ఆర్జన పెంచడం పైనే కాకుండా అందరికీ ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించి వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడం, రోడ్లు–రవాణా వసతులు పెంచడం, ప్రజలకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం ద్వారానే అందరికీ సమానమైన వృద్ధి (సమ్మిళిత వృద్ధి) సాధ్యమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజల చదువు, వైద్యంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడే రాష్ట్రాల మధ్య ఉండే పోటీతత్వం దేశం మొత్తానికి సమానమైన అభివృద్ధిని తెచ్చిపెడుతుంది.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు


