వ్లాదిమిర్‌ పుతిన్‌ (రష్యా అధ్యక్షుడు) రాయని డైరీ | President of Russia Vladimir Putin Rayani Diary | Sakshi
Sakshi News home page

వ్లాదిమిర్‌ పుతిన్‌ (రష్యా అధ్యక్షుడు) రాయని డైరీ

Jun 8 2025 1:25 AM | Updated on Jun 8 2025 1:25 AM

President of Russia Vladimir Putin Rayani Diary

‘‘... ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో నాకు తెలియదు/ నేను చేసిన తప్పేమిటో ఆమె చెప్పదు/ ఇప్పుడు నేను నిన్నటి కోసం ఆరాట పడుతున్నాను...’’
బీటిల్స్‌లో నాకిష్టమైన ‘ఎస్టర్‌డే’ సాంగ్‌!
‘‘... ప్రేమ చాలా సులభంగా తనలో దాచేసుకుంటుంది/ ఇప్పుడు నా ప్రేమను దాచటానికి ఒక స్థలం కావాలి/ నాకు నిన్నటి రోజే బాగుంది...’’

ఓహ్‌... పాల్‌ మెక్కార్ట్నీ!! ప్రాణం తీస్తున్నాడు. అతడింకా ఎందుకు బతికే ఉన్నట్లు? ఇంత గొప్ప పాటను రాశాక కూడా అతడికి ఇక్కడేం పని, ఈ భూమ్మీద?!
‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌... మిస్టర్‌ ప్రెసిడెంట్‌... మీ కాల్‌తో కనెక్ట్‌ అవటం కోసం మిస్టర్‌ ట్రంప్‌ వేచి ఉన్నారు...’’ – నికోలాయ్‌ పాత్రుషేవ్‌! నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌.

‘‘మే బీ, లిటిల్‌ లేటర్‌... కనీసం ఈ పాట అయ్యేంతవరకు...’’ అన్నట్లు సైగ చేశాను.
‘‘... అకస్మాత్తుగా నేను గతంలో ఉన్న మనిషిలో సగం అయ్యాను/ నా పైన ఒక నీడ వేలాడుతోంది/ నాకు నిన్నటి రోజే బాగుంది.’’
ఏం రాశావురా నాయనా మెక్కార్ట్నీ?!

మళ్లీ ట్రంప్‌ ఫోన్‌ ! 
కొద్దిసేపైనా ఆగలేరా ఈయన?! ‘ఎస్టర్‌డే’ని పాజ్‌లో పెట్టి ఫోన్‌  అందుకున్నాను.
‘‘హో హో... ట్రయింగ్‌ సిన్‌ ్స ఎస్టర్‌ డే మిస్టర్‌ పుతిన్‌ ’’ అన్నారు ట్రంప్‌.
పెద్దగా నవ్వాను. ‘‘నేను కూడా నిన్నట్నుంచీ ‘ఎస్టర్‌డే’ లోనే ఉన్నాను మిస్టర్‌ ట్రంప్‌’’ అన్నాను.

‘‘గాట్‌ ఇట్‌. బీటిల్సే కదా? పాల్‌ మెక్కార్ట్నీ సాంగ్‌! అంత బుద్ధిహీనునుడిని నేను ఇంత వరకూ చూళ్లేదు. ‘విడిపోయిన తర్వాత ఏమిటి? ఎలా?’ అని పెళ్లికి ముందే కాబోయే భార్యతో అగ్రిమెంట్‌ రాసుకోవాలన్న కనీస జ్ఞానం కూడా లేదు అతడికి’’ అన్నారు ట్రంప్‌.
‘‘ప్రేమ రాహిత్యపు పరితపనను సృష్టించ టానికి కావలసింది బుద్ధిహీనతే అయితే అలాంటి బుద్ధిహీనతకు నా మనసును పదే పదే పారేసుకుంటాను మిస్టర్‌ ట్రంప్‌’’ అన్నాను నవ్వుతూ.

‘‘బీటిల్స్‌ నాకు బోరింగ్‌. మళ్లీ ‘రోలింగ్‌ స్టోన్‌ ్స’ బ్యాండ్‌ నచ్చుతుంది. వాళ్లదొక సాంగ్‌ ఉంది. ఏమిటదీ... ఆ – యూ కాంట్‌ ఆల్వేస్‌... ‘నువ్వు కోరుకుంటున్న దానిని నువ్వు ఎల్లవేళలా పొందలేవు’...’’ అన్నారు ట్రంప్‌.
‘‘లోతుల నుంచి ‘ఎస్టర్‌డే’, ‘యూ కాంట్‌ ఆల్వేస్‌...’ రెండూ ఒకటే మిస్టర్‌ ట్రంప్‌! పోగొట్టుకున్నది తిరిగి పొందలేం, కోరుకున్న ప్రతిసారీ దక్కించుకోలేం...’’ అన్నాన్నేను.

హఠాత్తుగా క్రెమ్లిన్‌  ప్యాలెస్‌ కదిలిపోయేంత టెరిఫిక్‌గా నవ్వారు ట్రంప్‌!
‘‘ఏమైంది మిస్టర్‌ ట్రంప్‌?’’ అని అడిగాను.
‘‘ఏం లేదు మిస్టర్‌ పుతిన్‌! మీరు ఉక్రెయిన్‌ను పక్కన పెట్టేసి... బీటిల్స్‌
అంటున్నారు, నేను ఎలాన్‌ మస్క్‌ను తప్పించు కుని వచ్చి... రోలింగ్‌ స్టోన్‌ ్స అంటున్నాను’’ అన్నారు ట్రంప్, నవ్వు ఆపకుండానే!

‘‘అవును కదా!!’’ అని నేనూ నవ్వాను.
‘‘సరే, ఇది చెప్పండి. ‘నిన్నటి కోసం’
మీరెందుకు అంతగా ఆరాటపడుతున్నారు? ఎవరా స్వీట్‌హార్ట్‌?’’ అని అడిగారు ట్రంప్‌!

ట్రంప్‌ అలా అడగటం నాకు నచ్చింది. నిజానికి కూడా, ఎవరైనా అలా తమ పరిధిని దాటి లోపలికి చొరబడినప్పుడే మన మనసుకు దగ్గరగా అనిపిస్తారు.
‘‘ఎవరా స్వీట్‌హార్ట్‌ మిస్టర్‌ పుతిన్‌ ?’’ – మళ్లీ అడిగారు ట్రంప్‌.
‘‘ఎవరూ లేరు. ఆ పాట ఇష్టం. అంతే...’’ అన్నాను నవ్వుతూ.
ట్రంప్‌ ఫోన్‌  పెట్టేశాక, ‘ఎస్టర్‌డే’ పాజ్‌ తీసి, తిరిగి ప్లే చేశాను.

మరియా ఇవనోవ్నా నా స్వీట్‌హార్ట్‌! నా ఆకలి తీర్చే కొన్ని రొట్టె ముక్కల కోసం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో చెమటోడ్చి వీధులు ఊడ్చిన ఇవనోవ్నా! నేను చేసిన తప్పేమిటో చెప్పకుండా చిన్న ముద్దును నాకు శిక్షగా విధించి నన్ను చేతుల్లోకి ఎత్తుకున్న మా అమ్మ ఇవనోవ్నా! 

Advertisement
 
Advertisement
Advertisement